Murali Nayak: దేశ రక్షణలో అమూల్యమైన ప్రాణత్యాగం చేసిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు, ఆదివారం అశ్రునయనాల మధ్య ఆయన స్వగ్రామంలో నిర్వహించబడ్డాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన మురళీనాయక్ భౌతికదేహానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా భుజాన మోసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి మురళీనాయక్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన, అమర జవానుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోదని చెప్పారు. చిన్ననాటి నుంచే దేశ సేవపై ఆరాటం కలిగిన మురళీనాయక్ తరచూ “భారత జెండా కప్పుకుని చనిపోతా” అని చెప్పేవారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు.
Read Also: CM Yogi Adityanath : ఉగ్రవాదం అనేది కుక్కతోక లాంటిది: సీఎం యోగి ఆదిత్యనాథ్
మురళీనాయక్ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.50 లక్షలు ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌లతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అదనంగా, 5 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇల్లు స్థలం, మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, మురళీనాయక్ స్మరణార్థంగా ఆయన స్వగ్రామంలోనే ఒక మెమోరియల్ నిర్మించాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు. జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి, ఆయన త్యాగాన్ని భావి తరాలకు స్ఫూర్తిగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కళ్లితండా గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు, గ్రామ పేరును ‘మురళీనాయక్ తండా’గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. మురళీనాయక్ వీరమరణం, దేశం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.