ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసు(AP Liquor Case)లో అరెస్ట్ కావడం తీవ్ర సంచలనంగా మారింది. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకమైన నేతగా గుర్తింపు పొందిన మిథున్ అరెస్ట్(Midhun Reddy Arrest)తో వైసీపీకి తలపట్టుకునే పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఒక నేత అరెస్ట్ కాదు.. జగన్‌తో నేరుగా లింకులు ఉన్న కుటుంబంపై జరిగిన దాడిగా వైసీపీ నేతలు భావిస్తున్నారు.
మద్యం స్కామ్ కేసు గత వైసీపీ పాలనలోనే చోటుచేసుకున్నదనే విమర్శల నేపథ్యంలో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో పాత్ర ఉందంటూ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. టిడిపి నేతలు ఎప్పటినుంచో మిథున్ రెడ్డిపై ఆరోపణలు చేసినా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడం వల్లే ఇది సీరియస్ కదా అనే అనుమానాలు రేకెత్తాయి. అయితే కేంద్రంతో బలమైన సంబంధాలు ఉన్న మిథున్ రెడ్డి విచారణ తీరును ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో తాజాగా సిట్ ఆయనను అరెస్ట్ చేయడం వేగంగా జరిగిన కీలక పరిణామంగా చెబుతున్నారు.
AP Liquor Case : మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
వైసీపీ వర్గాల్లో మిథున్ రెడ్డి కుటుంబానికి ఉన్న ప్రభావం ప్రత్యేకమైనదిగా చెబుతారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం ఆధిపత్యం సాగిస్తూ వైసీపీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్ట్ జగన్‌కు నేరుగా ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. గతంలో వంశీ, పోసాని అరెస్టుల్ని మిథున్ కేసుతో పోల్చలేమని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మిథున్ కుటుంబం జగన్‌ను ప్రభావితం చేసే స్థాయిలో ఉండటంతో, ఇది నేరుగా జగన్‌ను టార్గెట్ చేసే కుట్రగా వైసీపీ అభిప్రాయపడుతోంది.
ఇక లిక్కర్ స్కామ్ విషయంలో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. తాజాగా మరో 8 మందిని కేసులో చేరుస్తూ కొత్త జాబితా విడుదల చేయడం సంచలనం కలిగించింది. వీరికి స్కామ్‌తో సంబంధం ఉందని సిట్ స్పష్టంచేసింది. అదే సమయంలో విజయసాయి రెడ్డి అప్రూవర్‌గా మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అప్రూవర్‌గా మారితే జగన్‌కు ఇది తీవ్రమైన రాజకీయ, న్యాయపరమైన సంక్షోభాన్ని తెస్తుందంటూ లీగల్ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ తదుపరి నిర్ణయం ఏంటన్నది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.