Spa Center : అది పేరుకు మసాజ్ పార్లర్. కానీ అందులో మహిళలతో పురుషులకు మసాజ్ చేయిస్తూ నిర్వాహకులు అడ్డంగా దొరికిపోయారు. ఆ మసాజ్‌లో గంజాయి ప్యాకెట్లు, కండోమ్‌ల ప్యాకెట్లు కూడా పెద్దసంఖ్యలో దొరికాయి. ఒంగోలు నడిబొడ్డున బండ్లమిట్ట సెంటర్‌లోని పార్వతమ్మ గుడి వద్దనున్న వీ2 మసాజ్ పార్లర్‌లో జరుగుతున్న ఈ తతంగాన్ని పోలీసులు బయటపెట్టారు. ఈ స్పాలోని సీలింగ్ లైట్లు అమర్చే రంధ్రాలలో 10 గంజాయి ప్యాకెట్లు దొరికాయి. 25 కండోమ్ ప్యాకెట్లు, 10 కండోమ్ బాక్సులను గుర్తించారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం ముందస్తుగా అందడంతో అక్కడున్న యువతులు పరారయ్యారని స్థానికులు అంటున్నారు. దీంతో వీ2 స్పా సెంటర్ నిర్వాహకులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ స్పా సెంటర్‌కు(Spa Center) ఎవరెవరు వెళ్లారు అనే వివరాలను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈగల్ రెడీ..
- ఈగల్ అంటే ‘‘ఎలైట్ యాంటీ- నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్’’.
- ఇది ఏపీ పోలీస్ శాఖలో ఏర్పాటైన కొత్త వ్యవస్థ.
- గంజాయి సాగు, మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టడమే దీని పని.
- దీని ఏర్పాటుపై ఏపీ హోంశాఖ కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.
- ఈగల్ టీమ్‌కు ఐజీ ఆకే రవికృష్ణ సారథ్యం వహిస్తారు. ఈయన గతంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఎస్పీగా, ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేశారు.
- ఈగల్ విభాగం కోసం అమరావతిలో రెండు స్టేషన్లు ఉన్నాయి.విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో రెండు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.
- మాదక ద్రవ్యాలపై ఫిర్యాదుల స్వీకరణ కోసం టోల్ ఫ్రీ నంబర్ 1972ను ఏర్పాటు చేశారు. అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ 24 గంటలపాటు పనిచేస్తుంది.
- నార్కోటిక్స్ పోలీసు, నార్కోటిక్స్ కంట్రోల్ విభాగాల్లో మొత్తం 450 మంది సిబ్బంది పని చేస్తారు.
- ప్రధాన కార్యాలయంలో 200 మంది, జిల్లాల్లోని విభాగాల్లో 181 మంది పనిచేస్తారు.
- ఈ విభాగాల్లో పనిచేసేందుకు పోలీసు సిబ్బందిని డిప్యూటేషన్‌పై తీసుకుంటారు. వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తారు.
- ఈగల్ విభాగంలో పనిచేసే పోలీసు సిబ్బందికి అదనపు ప్రోత్సాహకాలు లభిస్తాయి.