Liquor and Sand Scams : మంత్రి లోకేష్ బుధవారం నాడు చంద్రగిరి ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలోనే బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మిస్తామన్నారు. కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఫీడ్ బ్యాక్ తీసుకుని కష్టపడిన వారికి గుర్తింపునిస్తామన్నారు. ఫిబ్రవరి నుంచి పార్టీని బలోపేతం చేసే పని ప్రారంభిస్తామన్నారు. పార్టీ కోసం అధిక సమయం కేటాయిస్తానని లోకేష్ చెప్పారు.
ఏపీలో త్వరలో లిక్కర్,ఇసుక స్కాముల్లో చాలా మంది అరెస్టు అవుతారని ప్రకటించారు. రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హాయాంలో లిక్కర్, ఇసుక వ్యవహారం భారీ అవినీతి జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. ప్రభుత్వం మారగానే ఈ అంశాల్లో విచారణకు సీఐడీని అదేశిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే పలు కేసులు నమోదు చేశారు. సీఐడీ అంతర్గతంగా దర్యాప్తు చేస్తోంది. జే బ్రాండ్ల డిస్టిలరీల్లోనూ సోదాలు నిర్వహించారు. పలు సాక్ష్యాలు దొరికాయని.. ఆ జే బ్రాండ్లకు బినామీ ఓనర్లు వైసీపీ ముఖ్యనేతలేనని టీడీపీ అంటున్నారు.
పార్టీ క్యాడర్ కు నెలాఖరులోపు నామినేటెడ్ పోస్టులను ప్రకటిస్తామని నారా లోకేష్ తెలిపారు. పార్టీ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పునర్ వ్యవస్థీకరిస్తున్నామని దిగువ స్థాయి నుంచి పార్టీని నిర్మిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవులు వస్తాయన్నారు. పార్టీలో సంస్కరణలు తేవాల్సి ఉందన్నారు. టర్మ్ లిమిట్స్ ఉండాలన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తాను 3వసారి కొనసాగుతున్నానని లోకేష్ గుర్తు చేశారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీలో వ్యవస్థాగతంగా మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. పొలిట్ బ్యూరోలో ప్రతి రెండేళ్లకు ఒకసారి 30శాతం కొత్తవారు రావాలని.. అప్పుడే పార్టీలో మూమెంట్ వస్తుందన్నారు. అహర్నిశలు పాటుపడ్డవారికే గత ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చామని లోకేష్ తెలిపారు. ఫీల్డ్‌లో ఏం జరుగుతుందో ఎప్పటిప్పుడు తెలుసుకుంటామన్నారు.