ఈసారి టీడీపీ మహానాడు (Mahanadu) చరిత్రలో నిలిచిపోయే విధంగా నిర్వహించబోతున్నట్టు వైఎస్సార్ కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్. సవిత (Savitha) ప్రకటించారు. కడప జిల్లా పబ్బవరం (Pabbavaram)లో మే 27, 28, 29 తేదీల్లో జరగనున్న 44వ మహానాడు ఏర్పాట్లను ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గత మహానాడులతో పోలిస్తే ఈ ఏడాది మరింత వైభవంగా, సమగ్ర సదుపాయాలతో మహానాడు జరగనున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే టీడీపీ క్యాడర్, నాయకుల కోసం వసతులు, భోజనం, రవాణా వంటి అన్ని అంశాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ జనసంద్రం లక్ష్యం
మహానాడు కోసం రాయలసీమ నుంచి మూడు లక్షల మందికి పైగా క్యాడర్ సమీకరణ జరుగుతుందని, మొత్తం ఐదు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. వసతి ఏర్పాట్లను జిల్లాల వారీగా విభజించి ప్రత్యేక బాధ్యతలు కేటాయించామని పేర్కొన్నారు. చిత్తూరు, అనంతపురం, సత్యసాయి జిల్లాల నాయకులకు పులివెందులలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులకు కూడా మూడు రోజుల పాటు అన్నివిధాలా సహకారం అందించేందుకు కమిటీలు నియమించామని తెలిపారు. ఈ మహానాడులో రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐదు లక్షల మందితో బహిరంగ సభకు సిద్ధం
టీడీపీ రాష్ట్ర నేతలు పలు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ మహానాడు విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. పల్లా శ్రీనివాస్, దేవినేని ఉమా, నిమ్మల రామానాయుడు, జ్యోతుల నెహ్రూ తదితరులు పాల్గొన్న సమీక్ష సమావేశంలో బహిరంగ సభ, ప్రతినిధుల సమావేశాల నిర్వహణపై చర్చ జరిగింది. మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ జరగనుండగా, మూడోరోజు ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై దిశానిర్దేశం చేసే అవకాశముంది. ఈ మహానాడు ద్వారా పార్టీ బలోపేతానికి, రాయలసీమ అభివృద్ధికి కొత్త ఊపు లభించనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also : Anasuya : మా ఇంట్లోకి హనుమంతుడు వచ్చాడు.. అనసూయ పోస్ట్ వైరల్..