Site icon HashtagU Telugu

Ration Rice Scam : రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు..

Perni Nani, Perni Jayasudha

Perni Nani, Perni Jayasudha

Ration Rice Scam : మచిలీపట్నంలో జరిగిన రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. మినీ వ్యానులను ఉపయోగించినట్లు గుర్తించారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో సహా ఇతర నిందితులు 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు వెల్లడించారు.

రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని గురించిన అనుమానాలు కూడా గట్టిపడ్డాయి. గోడౌన్ మేనేజర్ మానస్ తేజ అకౌంట్ నుండి పేర్ని నాని అకౌంటుకి రూ.1.75 లక్షలు బదిలీ చేసిన విషయం పై విచారణ కొనసాగుతోంది. మేనేజర్ తక్కువ జీతం అయినప్పటికీ రూ.25 లక్షల లావాదేవీలు జరిపినట్లు ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం సొమ్ము ఆయనకు ఎలా వచ్చిందనే అంశంపై ప్రశ్నలు వేస్తున్నారు.

Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటన వివరాలను అడిగి తెలుసుకున్న పవన్

నిందితులను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న పోలీసులు, బ్యాంకు లావాదేవీలపై విచారణ చేపట్టారు. మేనేజర్ మానస్ తేజ, డ్రైవర్ మంగారావు, మిల్లర్ ఆంజనేయులను విచారించినప్పుడు, వారు సరిగా సహకరించలేదు. తద్వారా, పోలీసులు వారిని మరికొన్ని రోజులు కస్టడీకి పంపించాలని కోర్టుకు పిటీషన్ దాఖలు చేయాలని యోచిస్తున్నారు.

నిందితులు ముగ్గురు కూడా మాజీ మంత్రి పేర్ని నాని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ బియ్యం తరలించడంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, తమ పరిధిలోనే మాములుగా జరిగినట్టు చెబుతున్నారు. అయితే, పోలీసులు ఈ స్టేట్ మెంట్‌ని నమ్మడం లేదు. భారీ మొత్తంలో బియ్యం తరలించడం సాధ్యం కాదని, ఇందులో పెద్ద వ్యక్తుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు, కేసులో ప్రధాన నిందితురాలు, మాజీ మంత్రి పేర్ని సతీమణి జయసుధ కూడా మేనేజర్ మానస్ తేజే ఈ పని చేశాడని చెప్పినట్లు తెలుస్తోంది.

ఆమెను మరొకసారి విచారించే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పర్యవసానంగా, మచిలీపట్నం రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగించే చర్యలు జరుగుతున్నాయి.

CM Chandrababu : వైకుంఠ దర్శనాన్ని పది రోజులకు ఎందుకు పెంచారో తెలియదు