IMD Weather Update అనుకున్నదే జరిగింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌పై ఈ అల్పపీడనం ప్రభావం ఉండబోదని అంచనా వేస్తున్నారు. అయితే మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి దాని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. అలాగే ఏపీలో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి.
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- ఏపీపై ప్రభావం ఉండదని అంచనా
- మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. బుధవారం నాటికి ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని.. అయితే ఆంధ్రప్రదేశ్‌పై ఈ అల్పపీడన ప్రభావం ఉండదని చెబుతున్నారు. అయితే ఈ అల్పపీడనం ప్రభావంతో శ్రీలంక, తమిళనాడులో మాత్రం వర్షాలు కురుస్తాయి అంటున్నారు. అయితే ఈ అల్పపీడన ప్రభావం ఏపీపై ఎలా ఉంటుందో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందంటున్నారు.
వాస్తవానికి ఫిబ్రవరి నెలలో బంగాళాఖాతంలో తుఫాన్‌లు, వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడటం చాలా అరుదు అంటున్నారు. 1891 నుంచి 2024 వరకు కేవలం ఏడు తుఫాన్‌లు, వాయుగుండాలు మాత్రమే ఏర్పడ్డాయని చెబుతున్నారు.. మళ్లీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు అల్పపీడనం ఏర్పడిందని చెబుతున్నారు. అయితే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ నెల 19 తర్వాత ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడుతుంది అంటున్నారు. ఒకవేళ ఏర్పడితే తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు కోస్తా జిల్లాల్లో సోమవారం నాడు పొగమంచు దట్టంగా కురిసింది. ఆ చివర శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకు పొగమంచు తీవ్రత కనిపించింది. విజయవాడల చుట్టుపక్కల దట్టమైన పొగమంచు దెబ్బకు విమానాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. సోమవారం బిల్‌గేట్స్ వచ్చిన విమానం ల్యాండింగ్‌కు పొగమంచు ఆటంకంగా మారింది. విమానం కొద్దిసేపు గాల్లోనే చక్కర్లు కొట్టి.. ఆ తర్వాత ల్యాండ్ అయ్యింది. అయితే ఇవాళ కూడా ఉత్తరాంధ్రతో పాటుగా కోస్తా జిల్లాల్లో పొగమంచు కురిసింది. అయితే ఎండల తీవ్రత కూడా పెరిగింది.. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. సోమవారం కర్నూలులో ఏకంగా 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని చెబుతున్నారు. ఇక చలి తీవ్రత తగ్గి ఎండల తీవ్రత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా ఎండల తీవ్రత పెరిగింది.. ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం ఉంది.
