Site icon HashtagU Telugu

Nara Lokesh : జాతీయ విద్యా విధానానికి లోకేశ్‌ మద్దతు

Lokesh supports National Education Policy

Lokesh supports National Education Policy

Nara Lokesh : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జాతీయ విద్యా విధానం (NEP-2020)పై ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తన పూర్తి మద్దతు తెలిపారు. ఇటీవల ‘ఇండియా టుడే సౌత్‌ కాన్‌క్లేవ్‌ 2025’లో మాట్లాడిన ఆయన, ఈ విధానం భాషా వివిధతను ప్రోత్సహించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. లోకేశ్‌ మాట్లాడుతూ..మూడు భాషల విధానం విద్యార్థులకు భిన్న భాషలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో హిందీని తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విధానం లో హిందీకి బదులుగా విద్యార్థులు తాము కోరుకునే ఇతర భాషల్ని కూడా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది అని ఆయన స్పష్టం చేశారు.

‘మాతృభాషకు ప్రాధాన్యం’

తన అనుభవాన్ని పంచుకుంటూ లోకేశ్‌ మాట్లాడుతూ..ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో జరిగిన భేటీలో మాతృభాషలో బోధనపై స్పష్టమైన చర్చ జరిగినట్టు తెలిపారు. ఒక భారతీయుడిగా మాతృభాష ప్రాముఖ్యత నాకు బాగా తెలుసు. అదే సమయంలో, హిందీ నేర్చుకోవడం వల్ల దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్‌కు అవకాశం ఉంటుంది అని వివరించారు. నాకు మూడు భాషల్లో పట్టు ఉంది. నా కుమారుడు కూడా త్రిభాషా విధానం ప్రకారం అభ్యాసం చేస్తున్నాడు. ప్రస్తుతం విద్యార్థులు ఐదు భాషలు నేర్చుకుంటున్నారు. జర్మన్‌, జపనీస్‌ వంటి విదేశీ భాషలు కూడా అందులో ఉన్నాయి. ఇవి ఉద్యోగ అవకాశాల్లో ఉపయుక్తమవుతాయి అన్నారు లోకేశ్‌.

‘దక్షిణాది భాషలు నేర్చుకోవడంలో తప్పేముంది?’

వివిధ రాష్ట్రాల భాషల పరస్పర అభ్యాసంపై మాట్లాడుతూ..ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది భాషలు నేర్చుకోవాలన్న ప్రతిపాదనపై స్పందిస్తూ లోకేశ్‌ ఎందుకు నేర్చుకోకూడదు? భాష అనేది అభివృద్ధికి మార్గం. ఆంధ్రప్రదేశ్‌లో ఒడియా, తమిళం, కన్నడ వంటి భాషలలో బోధనకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు తాము ఇష్టపడే భాష నేర్చుకోవాలి. ఇది రాజకీయ నిర్ణయంగా కాక, విద్యార్థుల అభిరుచి ఆధారంగా ఉండాలి అని స్పష్టం చేశారు.

ఎన్డీయేతో పొత్తు కొనసాగుతుంది..

రాజకీయ పరిణామాలపై స్పందించిన లోకేశ్‌, తెలుగుదేశం పార్టీ (TDP) – ఎన్డీయే (NDA) పొత్తు 2029 తర్వాత కూడా కొనసాగుతుందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డి తెలుగువారన్న విషయాన్ని గుర్తుచేసినప్పుడు, లోకేశ్‌ స్పందిస్తూ, తెలుగువాడు అయినా సరే, దేశ ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యం. మా పార్టీ ‘భారత్ ఫస్ట్‌’ అనే నినాదంతో ముందుకు సాగుతోంది అని స్పష్టం చేశారు.

Read Also: Nepal: నేపాల్‌లో సోషల్‌ మీడియా బ్యాన్‌