ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కు డల్లాస్‌లో అపూర్వ స్వాగతం లభించింది. ఎన్నారై టీడీపీ నాయకులు, అభిమానులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. డల్లాస్ శివారు ప్రాంతమైన గార్లాండ్‌లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ వైసీపీ పై ఓ రేంజ్ లో సెటైర్లు వేశారు. ‘వై నాట్ 175’ అన్నవారికి ప్రజలే ‘వై నాట్ 11’ అని సమాధానం ఇచ్చారని ఎద్దేవా చేశారు. ‘సిద్ధం సిద్ధం’ అంటూ బయలుదేరిన ఆ పార్టీని ప్రజలు ఏకంగా భూస్థాపితం చేశారని, ఈ మీటింగ్‌ను చూసిన తర్వాత కూడా ఆ పార్టీకి నిద్రపట్టదని విమర్శించారు.
Nara Lokesh : డల్లాస్ లో నారా లోకేష్ క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే !!
టీడీపీ కార్యకర్తలు చేసిన త్యాగాలను గుర్తుంచుకోవాలని, మెడపై కత్తి పెట్టినా ‘జై చంద్రబాబు’ అని నినదించి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రయ్య వంటి వారు తనకు స్ఫూర్తి అని భావోద్వేగానికి లోనయ్యారు. రక్తం కారుతున్నా చివరి ఓటు వేసే వరకు బూత్‌లో నిలబడిన మంజుల రెడ్డికి, పుంగనూరులో మీసాలు మెలేసి, తొడగొట్టిన అంజిరెడ్డి తాత వంటి ధైర్యవంతులకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎన్.టి.రామారావు (ఎన్టీఆర్) గారి వారసత్వాన్ని, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికతను కొనియాడారు. ఎన్టీఆర్ గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి పరిచయం చేసి, సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేశారని అన్నారు. ఒకప్పుడు మదరాసీలు అని పిలిచే స్థాయి నుంచి “తెలుగువాళ్ళం” అని దేశానికి చాటిచెప్పిన ఘనత అన్న ఎన్టీఆర్ గారిదని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు నాయుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా అభివర్ణించారు. అభివృద్ధి చేసి కూడా ఎన్నికల్లో గెలవవచ్చని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు గారని తెలిపారు. ఐటీ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు గారు చెప్పినప్పుడు, ‘కంప్యూటర్లు అన్నం పెడతాయా?’ అని ప్రతిపక్ష నేతలు చేసిన విమర్శలను లోకేష్ గుర్తుచేస్తూ, ఇప్పుడు కంప్యూటర్ అన్నం పెడుతోందా లేదా అని సభలోని వారిని ప్రశ్నించారు.
Nara Lokesh : ‘నా తల్లిని’ అవమానిస్తే నేను వదిలిపెడతానా? – లోకేష్ మరోసారి వార్నింగ్
చంద్రబాబు దూరదృష్టి వల్లే హైదరాబాద్‌కు పెద్దఎత్తున ఐటీ కంపెనీలు వచ్చాయని, నేడు బెంగళూరుకు హైదరాబాద్ గట్టి పోటీ ఇస్తోందని లోకేష్ వివరించారు. 75 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు గారు 20 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నారని, ఆయన స్పీడ్‌ను తాను ఇంకా అందుకోలేకపోతున్నానని, త్వరలో ఆయన దరిదాపుల్లోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఐటీ, ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ గురించి మాట్లాడటం ఆయన ముందుచూపుకు నిదర్శనమని, తెలుగుజాతికే ఆయన ఒక అదృష్టమని ప్రశంసించారు. ఏ దేశానికి వెళ్లినా, ఏ కంపెనీకి వెళ్లినా తమకు సాదర స్వాగతం లభిస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారేనని స్పష్టం చేశారు.
