టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు విశాఖ కోర్టుకు హాజరైయ్యారు. ఈక్రమంలో సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో లోకేష్ ఈ రోజు విచారణకు హాజరైయ్యారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన వీక్ మీడియా క్షమాపణలు కోరిందని, అయితే సాక్షి, దక్కన్ క్రానికల్ మీడియా సంస్థలు మాత్రం వివరణ కూడా ఇవ్వలేదని లోకేష్ తెలిపారు.
మాజీ మంత్రి వివేక హత్య తర్వాత చంద్రబాబుపై సాక్షి మీడియా దుష్ప్రచారం చేశారని..తమపై అసత్య కథనాలు ప్రచురించారని ఆరోపించారు. మొదటి నుంచీ సాక్షి మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని.. వ్యక్తిగత జీవితంపై కూడా సాక్షి మీడియా బురద జల్లిందన్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం సాక్షి మీడియా చేసిందని, తప్పుడు వార్తలు రాస్తే చట్టప్రకారం ముందుకు వెళ్తానని లోకేష్ స్పష్టం చేశారు.
టీడీపీ కోసం ప్రత్యేక ఐపీసీ సెక్షన్‍ను వైసీపీ పెట్టిందని ఇప్పుడు తనపై మర్డర్ కేసు సహా 13 కేసులు పెట్టారన్నారు. ప్రజల తరపున పోరాడుతున్నందుకే తమపైన, పార్టీ నేతలపైనా దొంగ కేసులు పెడుతున్నారని ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని లోకేష్ అన్నారు. తన తల్లిపై అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడారని.. విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
అయితే అది తమ సంస్కృతి అది కాదని, ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశానని ఆయన అన్నారు. ఇక తన తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని లోకేష్ హెచ్చరించారు. తమ కుటుంబం పై ప్రచారం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని లోకేష్ హెచ్చరించారు. పరువు నష్టం దావా విషయంలో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం లోకేష్ వచ్చారు. దీనిపై కౌంటర్ వేయడానికి ఇతర మీడియా సంస్థలు సమయం కావాలని అడిగాయి. ఇప్పటికే పలుమార్లు అలా అడగడంతో న్యాయమూర్తి ఎక్కువ సమయం ఇవ్వలేమని 28వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు.
