Site icon HashtagU Telugu

Liquor Scandal : జగన్‌కు షాకిచ్చే నిర్ణయం దిశగా చంద్రబాబు సర్కారు

Ap Liquor Scam Ys Jagan Chandrababu Government

Liquor Scandal : ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారు  వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఓ స్కాం వ్యవహారంలో ఆయనకు అనూహ్య షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో జరిగినట్టుగా చెబుతున్న భారీ లిక్కర్ స్కాం విషయంలో ఈవారంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంటారని సమాచారం.   ఈ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తే అసలు విషయాలన్నీ బయటికి వస్తాయని చంద్రబాబు సర్కారు భావిస్తోందట. లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు మొదలయ్యాక.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దూకితే అక్రమ మార్గాల్లో మన దేశం దాటి వెళ్లిన నిధుల విషయంలో క్లారిటీ వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ సర్కారులో చక్రం తిప్ప ముఖ్యనేతల గుట్టు ఈ స్కాంతో అందరి ముందుకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read :KTR : నల్గొండ జిల్లాలో కేటీఆర్‌పై రెండు కేసులు.. ఎందుకంటే.. ?

రూ.4000 కోట్లు దుబాయ్, ఆఫ్రికాలకు.. 

తాజాగా సోమవారం రోజు(మార్చి 24న)  లోక్‌‌సభ వేదికగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన ఆరోపణలు చేశారు. ‘‘వైఎస్సార్ సీపీ పాలనలో రూ.99 వేల కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. అందులో రూ.18 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. ఆయన మరో రూ.4000 కోట్లను బినామీల పేరిట దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఓ మౌలిక వసతుల కంపెనీ పేరుతో ఎన్‌. సునీల్‌రెడ్డి అనే వ్యక్తి రూ.2 వేల కోట్లను దుబాయ్​కి తరలించారు. మరో వెయ్యి కోట్లు ఆఫ్రికా దేశాలకు తరలించారు’’ అని ఆయన ఆరోపించారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే లోక్‌సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఈవివరాలను వెల్లడించినట్లు తెలిసింది. పార్లమెంటులో ఈ వ్యవహారాన్ని ప్రస్తావించాక, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు. మద్యం కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయించేందుకు అమిత్ షా అనుమతిని కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. ‘‘లోక్‌సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికీ ప్రాతినిధ్యం తగ్గకుండా దేశంలోని లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలి’’ అని కోరుతూ మార్చి 22న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వైఎస్ జగన్ లేఖ రాశారు. ఇది జరిగిన రెండు రోజులకే లోక్‌సభ వేదికగా లిక్కర్ స్కాంపై  లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపణలు గుప్పించడం గమనార్హం.

Also Read :Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో “భూ భారతి”పై వాడీవేడి చర్చ

కొత్తకొత్త బ్రాండ్లను తయారు చేయించి..  

‘‘వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే ఏపీలో ఉన్న 20 నుంచి 25 డిస్టిలరీలను(Liquor Scandal) స్వాధీనంలోకి తీసుకున్నారు. 26 కొత్త కంపెనీలను ప్రవేశపెట్టారు. కొత్తకొత్త పేర్లతో మద్యం బ్రాండ్లను తయారుచేయించారు. వాటిని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు ఇచ్చారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే దుకాణాల్లో వాటిని విక్రయించారు. అన్నీ  నగదు లావాదేవీలే చేశారు’’ అని లావు శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు.  వైఎస్సార్ సీపీ హయాంలో ప్రధాన మద్యం బ్రాండ్లను తరిమేసి, వాటి స్థానంలో సొంత బ్రాండ్లను తెచ్చి నాసిరకం మద్యాన్ని భారీ రేట్లకు సేల్ చేశారనే ఆరోపణలు టీడీపీ నేతల వైపు నుంచి వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలోనే దాదాపు 4 వేల కోట్లు చేతులు మారాయని అంటున్నారు.