ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాలు (AP Liquor) కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న మార్పుల కారణంగా మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ప్రైవేటు మద్యం షాపులకు టెండర్లు కేటాయించిన తర్వాత, అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.6312 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది.
75 రోజుల్లో 26.79 లక్షల బీరు కేసులు, 83.75 లక్షల మద్యం కేసులు విక్రయమైనట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బార్లు, వైన్ షాపులు కలిపి ఈ అమ్మకాలు జరిగినట్లు పేర్కొన్నారు. ప్రత్యేకించి డిసెంబర్ 31, జనవరి 1 నూతన సంవత్సర వేడుకల కోసం ఇప్పటికే భారీ స్థాయిలో మద్యం స్టాక్‌ను పంపిణీ చేసినట్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం నడిపిన ప్రభుత్వ మద్యం షాపుల విధానాన్ని చంద్రబాబు నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పాత విధానాన్ని పునరుద్ధరించి, 2019కు ముందు అందుబాటులో ఉన్న పాత బ్రాండ్లను తిరిగి తీసుకువచ్చింది. తక్కువ ధరల్లో నాణ్యమైన మద్యం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. న్యూ ఇయర్ సందర్బంగా మద్యం విక్రయాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజుల్లో మద్యం షాపులు, బార్లు భారీగా లాభాలు పొందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే సంక్రాంతి పండగకు కూడా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మద్యం విక్రయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరడం విశేషం.
Read Also : Ration Rice Missing Case : పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు..!