Site icon HashtagU Telugu

Lakshminarayana : ప్ర‌జాశాంతి పార్టీలోకి లక్ష్మీనారాయ‌ణ ?

Lakshminarayana

Lakshminarayana

ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తో వీవీ లక్ష్మీనారాయ‌ణ(Lakshminarayana) చేతులు క‌లిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు(Vizag steel) కాకుండా చేయ‌డానికి పాల్ ను ఆశ్ర‌యించారు. వాళ్లిద్ద‌రూ క‌లిసి సంయుక్తంగా విశాఖ కేంద్రంగా మీడియా ముందుకొచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం ఆలోచన మార్చ‌గ‌ల శ‌క్తి కేఏ పాల్ కు ఉంద‌ని వీవీ న‌మ్ముతున్నారు. అందుకే, ఆయ‌న‌తో క‌లిసి ముందుకు న‌డుస్తున్నాన‌ని అన్నారు. అంటే, రాబోవు రోజుల్లో వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌జాశాంతి పార్టీలో చేర‌తార‌ని అప్పుడే టాక్ మొద‌ల‌యింది.

ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తో వీవీ లక్ష్మీనారాయ‌ణ(Lakshminarayana)

గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ నుంచి వీవీ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీకి దిగారు. ఓడిపోయిన త‌రువాత కొద్దికాలం సైలెంట్ గా ఉంటూ వ‌చ్చారు. ఆ త‌రువాత నాన్ సీరియ‌స్ పొలిటిషియ‌న్ గా ప‌వ‌న్ ను భావిస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ రోజు నుంచి ఆయ‌న రాజ‌కీయ వేదిక‌గా కోసం అన్వేషిస్తున్నారు. విశాఖ ఎంపీ అభ్య‌ర్థిగా పోటీ చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చే పార్టీలోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, అక్క‌డ ప్ర‌ధాన పార్టీల‌కు అభ్య‌ర్థులు ఉన్నారు. దీంతో స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగానైనా పోటీ చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. తాజాగా ప్ర‌జాశాంతి పార్టీ ఆశ్ర‌యం పొంద‌డానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని వినికిడి.

బీజేపీలో చేర‌తార‌ని ప్ర‌చారం

ఒక‌ప్పుడు సీబీఐ డైరెక్ట‌ర్ గా వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ(Lakshminarayana) హీరోగా ప్ర‌జ‌ల‌కు క‌నిపించారు. కార‌ణం, తెలుగు రాష్ట్రాల్లోని గాలి జనార్థ‌న్ రెడ్డి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆస్తుల కేసుల విచార‌ణ చేయ‌డం. ఆ రోజున ఆయ‌న చేసిన విచార‌ణ ఒక సంచ‌ల‌నం. మైనింగ్ కింగ్ గాలి కేసు విచార‌ణ ఒక స‌వాల్. ఆ కేసును విచారించ‌డం ఒక ఎత్తైతే, మాజీ సీఎం కుమారుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని జైలుకు పంపిచ‌డం మ‌రో ఎత్తు. ఈ రెండు కేసులు లక్ష్మీనారాయ‌ణ టాలెంట్ ను తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసింది. దాన్ని అంచ‌నా వేసుకున్న ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాల‌ని భావించారు. తొలుత వ్య‌వ‌సాయం మీద దృష్టి పెట్టారు. రైతుల‌తో క‌లిసి స‌మావేశాల‌ను నిర్వ‌హించారు. వాళ్ల నుంచి వ్య‌వ‌సాయం లాభ‌సాటిగా ఉండాలంటే ఏమి చేయాలి? అనే అంశంపై చ‌ర్చ‌లు పెట్టారు. ఆ సంద‌ర్భంగా బీజేపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆయ‌న ఆ పార్టీకి దూరంగా ఉన్నారు.

ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకించే పార్టీల‌కు మ‌ద్ధ‌తు

ఒకానొక స‌మ‌యంలో టీడీపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, విశాఖ ఎంపీ అభ్య‌ర్థిగా బాల‌క్రిష్ణ చిన్న‌ల్లుడు ఉన్నారు. దీంతో లక్ష్మీనారాయ‌ణ‌కు టీడీపీ అవకాశం ఇవ్వ‌లేక‌పోయింది. చివ‌ర‌కు జ‌న‌సేన పార్టీలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఏ పార్టీ కూడా ఆయ‌న్ను ఆద‌రించ‌డానికి సిద్దంగా లేదు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఒంటరిగా ఇష్యూల మీద పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ అంశాన్ని తీసుకున్నారు. కేంద్రం నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా పాద‌యాత్ర‌కు దిగారు. ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకించే పార్టీల‌కు మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నారు. ఇటీవ‌ల బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు. టెండ‌ర్ ప్ర‌స్తావ‌న లేకుండానే టెండ‌ర్ వేస్తామ‌ని బీఆర్ఎస్ నేతలు ప్ర‌క‌టించ‌గానే, వాళ్ల‌ను శ‌భాష్ అంటూ ల‌క్ష్మీనారాయ‌ణ(lakshminarayana) ప్ర‌శ‌సించారు. ఆ త‌రువాత అస‌లు నిజాన్ని తెలుసుకుని నాలుక్క‌రుచుకుని తానే టెండ‌ర్ వేస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దాని మీద ప‌లు ర‌కాలు ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న ఎదుర్కొన్నారు. ల‌క్ష్మీనారాయ‌ణ ఆస్తిపాస్తుల మీద ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లింది.

Also Read : Janasena : క‌ద‌ల్లేని వారాహి, ఢిల్లీ బీజేపీ చేతిలో స్టీరింగ్

ఇప్పుడు తాజాగా కేఏ పాల్ ను ఆశ్ర‌యించారు. విశాఖ స్టీల్ ప్లాంట్(vizag steel) ను కాపాడాల‌ని కోరుతున్నారు. ఆయ‌న్ను కేంద్రం వ‌ద్ద‌కు పంపుతున్నారు. ప్ర‌ధాని మోడీ, అమిత్ షా, రూపావాలా త‌దిత‌ర పేర్ల‌ను ఎప్పుడూ పాల్ చెబుతుంటారు. వాళ్లంద‌రూ త‌న‌కు తెలుసని ప‌లుమార్లు వెల్ల‌డించారు. ఒకసారి మాత్రం కేఏ పాల్ కు కేంద్ర మంత్రి అమిత్ షా ఇటీవ‌ల అపాయిట్మంట్ ఇచ్చారు. దాన్ని చూసిన త‌రువాత కేఏ పాల్ కు కేంద్రంతో సంబంధాలు ఉన్నాయ‌ని కొంద‌రు న‌మ్ముతున్నారు. వాళ్ల‌లో వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ(Lakshminarayana) కూడా ఉన్నారు. అందుకే, పాల్ తో చేతులు క‌లిపారు. ఈ స్నేహం రాబోయే రోజుల్లో ప్ర‌జాశాంతి పార్టీ వైపు లక్ష్మీనారాయ‌ణ‌ను తీసుకెళుతుంద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల్స్ అప్పుడే మొద‌ల‌య్యాయి.

Also Read : Vizag Capital : సెప్టెంబ‌ర్ లో విశాఖకు జ‌గ‌న్ కాపురం,మ‌ళ్లీ 3 రాజ‌ధానులు