Site icon HashtagU Telugu

Suparipalanalo Toliadgugu: సుపరిపాలనలో తొలి అడుగు.. ఏడాది పాలనపై రేపు కూటమి ప్రభుత్వం సమావేశం!

Suparipalanalo Toliadgugu

Suparipalanalo Toliadgugu

Suparipalanalo Toliadgugu: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా “సుపరిపాలనలో తొలి అడుగు” (Suparipalanalo Toliadgugu) పేరిట ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు రాజధాని అమరావతిలో ఈ కార్యక్రమం జరగనుంది. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై “సుపరిపాలనలో తొలి అడుగు” సమావేశాన్ని నిర్వహించనున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన జూన్ 12వ తేదీనే ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించినా.. అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా వేశారు.

రేపటి సమావేశంలో ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించుకునేలా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వచ్చే నాలుగేళ్లలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంతో పాటు అభివృద్ధి లక్ష్యాలను ఎలా సాధించాలన్న అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. అమరావతిలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, హెచ్వోడీలు, సెక్రటరీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరు అవుతారు.

Also Read: Yoga : యోగా, మెడిటేషన్‌కు దూరంగా ఉన్నారా? ఒకసారి ఫాలో అయ్యి చూడండి.. అద్భుత ప్రయోజనాలను మీరే చూడొచ్చు!

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలపైనా దృష్టి

కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుని రెండో ఏడాదిలోకి అడుగుపెట్టింది. గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక, పాలనా విధ్వంసాలను సరిచేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపిస్తోంది. స్వల్పకాలిక అభివృద్ధి లక్ష్యాలతో పాటు వికసిత ఆంధ్రప్రదేశ్ సాధన కోసం స్వర్ణాంధ్ర @2047 విజన్ లాంటి దీర్ఘకాలిక ప్రణాళికల్ని కూడా కూటమి ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం, రాష్ట్రానికి పరిశ్రమలు-పెట్టుబడులను తీసుకురావటం, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పన, తదితర అంశాల్లో వేగంగా అడుగులు వేస్తోంది. ఏడాదిలో చేసిన సుపరిపాలనను సమీక్షించుకునేందుకు-రాష్ట్ర భవిష్యత్ కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ అనే పేరిట ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది.

ఇదే సమయంలో ఈ ఏడాది ఏం చేయాలి? ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ వివరిస్తూ.. ఈ ఏడాది చేపట్టే కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. 26 జిల్లాల నుంచి వచ్చే అధికారులతో సమావేశం ముగిసిన తరువాత.. అందరితో కలిసి సీఎం, మంత్రులు అక్కడే డిన్నర్ చేయనున్నారు.