Site icon HashtagU Telugu

Kurnool Road Accident: కర్నూలు రోడ్డు ప్రమాదం.. 18 మృతదేహాలు మాత్ర‌మే అప్పగింతకు ఏర్పాట్లు!

Kurnool Road Accident

Kurnool Road Accident

Kurnool Road Accident: కర్నూలు జిల్లా చెట్లమల్లాపురం గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Kurnool Road Accident) సజీవ దహనమైన 19 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత మూడు రోజులుగా తమ వారి మృతదేహాల కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు ఈ పరిణామం ఊరటనిచ్చింది. ప్రమాదంలో 19 మంది మరణించగా.. ఇందులో 18 మంది మృతదేహాల గుర్తింపు కోసం విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయ్యాయి. అధికారులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌, మృతదేహాల అవయవాల శాంపిల్స్ సరిపోలడంతో డీఎన్‌ఏ ప్రక్రియ విజయవంతమైంది. ఈ 18 మృతదేహాలను ఆరు రాష్ట్రాలకు చెందిన బాధిత కుటుంబాలకు అప్పగించేందుకు రెవెన్యూ, పోలీసులతో పాటు వివిధ శాఖల అధికారులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఒక మృతదేహంపై సస్పెన్స్

మరో మృతుడు చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు మృతదేహం అప్పగింతపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. త్రిమూర్తులు బంధువులు రాత్రి ఆలస్యంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీఎన్‌ఏ ఫలితాలు రావాల్సి ఉంది. ఈ ఫలితాలు వచ్చిన తర్వాతే అతడి మృతదేహాన్ని అప్పగించే అంశంపై స్పష్టత వస్తుంది. కాగా ప్రమాదంలో మృతి చెందిన మరొక వ్యక్తి మృతదేహం తాలూకు బంధువులు ఎవరూ రాకపోవడంతో అధికారులు మట్టి కార్యక్రమం (అంతిమ సంస్కారాలు) నిర్వహించారు.

Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్‌ఎస్‌ కథ పరిసమాప్తం అంటున్న మంత్రులు!

చెట్లమల్లాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరో సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికక్కడే మృతి చెందిన కర్నూలు నివాసి శివశంకర్ అనే వ్య‌క్తి మద్యం సేవించి బైక్‌ నడుపుతున్నట్లు ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (RFSL) నివేదిక ద్వారా వెల్లడైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదానికి సంబంధించిన ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (RFSL) కర్నూలు తన విశ్లేషణా నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో మృతుడి విస్సెరా నమూనాలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ నివేదిక ఆధారంగాన ప్రమాదం జరిగిన సమయంలో శివశంకర్ మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలిందని పోలీసులు ధృవీకరించారు. డ్రైవర్ నిర్లక్ష్యం, మద్యం సేవించడం ఈ ఘోర ప్రమాదానికి దారితీసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Exit mobile version