Site icon HashtagU Telugu

Kurnool Bus Fire: క‌ర్నూలులో ఘోర ప్ర‌మాదం.. మంట‌ల్లో కాలిపోయిన బ‌స్సు, వీడియో ఇదే!

ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ సిరి తెలిపిన వివరాల ప్రకారం.. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. సుమారు 20 నుంచి 25 మంది ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.

Kurnool Bus Fire

Kurnool Bus Fire

Kurnool Bus Fire: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వోల్వో బస్సు అగ్నిప్రమాదానికి (Kurnool Bus Fire) గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ విషాద ఘటనలో సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం అయినట్లుగా తెలుస్తోంది.

ప్రమాద వివరాలు

శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో కర్నూలు శివారులోని చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ‘వి కావేరి ట్రావెల్స్’కు చెందిన ఈ బస్సు ఒక బైకును ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ బస్సు కిందకు వెళ్లడం వల్ల ప్రధాన డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు బయటపడలేకపోయారు. బైక్‌పై ప్రయాణిస్తున్నవారు కూడా ఈ ప్రమాదంలో మరణించారు.

ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ సిరి తెలిపిన వివరాల ప్రకారం.. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. సుమారు 20 నుంచి 25 మంది ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.

Also Read: Kamdhenu: అదృష్టం, సంపద కలిసి రావాలంటే ఇంట్లో కామధేనువు విగ్రహాన్ని ఈ దిశలో పెట్టాల్సిందే! ‎

సహాయక చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించారు. గాయపడిన వారికి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. ప్రమాద తీవ్రత పెరగడంతో డ్రైవర్, సహాయక డ్రైవర్ ప్రయాణికులను నిద్రలేపి కొందరు ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటపడ్డారని తెలిపారు.

ప్రమాదం జరిగిన తర్వాత ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, సహాయక సిబ్బంది ఘటనా స్థలం నుంచి పారిపోయారు. అనంతరం పోలీసులు డ్రైవర్, సహాయక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ప్రధాని మోదీ సంతాపం, ఎక్స్‌గ్రేషియా ప్రకటన

కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం తనను చాలా బాధించిందని పేర్కొన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ప్రమాదం నుంచి బయటపడినవారి వివరాలు

సత్యనారాయణ (సత్తుపల్లి), జైసూర్య (మియాపూర్), నవీన్‌కుమార్‌ (హయత్‌నగర్‌), సరస్వతి హారిక (బెంగళూరు), నేలకుర్తి రమేశ్‌ (నెల్లూరు), కటారి అశోక్‌ (రంగారెడ్డి జిల్లా), ముసునూరి శ్రీహర్ష (నెల్లూరు), పూనుపట్టి కీర్తి (హైదరాబాద్‌), వేణుగోపాల్‌రెడ్డి (హిందూపురం), రామిరెడ్డి (ఈస్ట్‌ గోదావరి), లక్ష్మయ్య, శివనారాయణ (డ్రైవర్లు).

Exit mobile version