Kuppam Municipal Chairman : చిత్తూరూ జిల్లా కుప్పంలో వైఎస్‌ఆర్‌సీపీకి భారీ షాక్ తగిలింది. ఈ పార్టీకి చెందిన కీలక నేత, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలో చేరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన లేఖను కుప్పం మున్సిపల్ కమిషనర్‌కు పంపించానని తెలిపారు. చంద్రబాబుతో కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని పేర్కొన్నారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని సుధీర్ అన్నారు.
అంతకు ముందు సుధీర్ రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీకి, కౌన్సిలర్ పదవీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 25 వార్డులకు గాను వైఎస్‌ఆర్‌సీపీ 19 వార్డుల్లో విజయం సాధించింది.టీడీపీ 6 చోట్ల మాత్రమే గెలిచింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు విజయదుందుబి మోగించాడు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా రాలేదు. అలా భారీ మెజార్టీతో టీడీపీ విజయం సాధించిందని పలు సందర్భాల్లో సీఎం చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. ఇక, వైఎస్‌ఆర్‌సీపీ నుండి ఇప్పటికే పలువురు రాజీనామా చేసి అధికార టీడీపీలో కొందరూ చేరితే.. మరికొందరూ జనసేనలో చేరారు. ఇలా చాలా వరకు అధికారంలో ఉన్న కూటమిలోకి పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ రెడ్డి టీడీపీ లో చేరారు.
ఇకపోతే..ఇతర పార్టీల నుంచి వచ్చేవారు తెలుగు దేశం పార్టీలో చేరాలంటే కచ్చితంగా వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని చంద్రబాబు కండిషన్ పెట్టారు. ఈ క్రమంలోనే సుధీర్ వైఎస్సార్‌సీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిన తర్వాతే తెలుగు దేశం పార్టీలో చేరారు. రెండు, మూడు నెలల క్రితమే సుధీర్ టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది.. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. చివరికి సుధీర్ తన అనుచరులతో కలిసి వచ్చి అధికార పార్టీలో చేరారు. అయితే సుధీర్ తన పదవులకు రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది.