KTR on AP: ఏపీ పై కేటీఆర్ కన్ను, కేంద్రంపై విశాఖ స్టీల్ అస్త్రం..!

ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని బీఆర్ఎస్ ఎంచుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైన కేంద్రాన్ని టార్గెట్ చేసింది.

  • Written By:
  • Updated On - April 3, 2023 / 11:16 PM IST

KTR on AP : ఏపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని BRS ఎంచుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమైన కేంద్రాన్ని టార్గెట్ చేసింది. అవసరమైతే గ్లోబల్ టెండర్ లో పాల్గొని కేంద్రం వాటాలను రాష్ట్రం కొనుగోలు చేస్తుందని జగన్మోహన్ రెడ్డి సర్కార్ కార్మికులకు హామీ ఇచ్చింది. ఇప్పుడు మంత్రి KTR రంగంలోకి దిగారు. ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాశారు. సీఎం కేసీఆర్ బదులుగా మంత్రి కేటీఆర్ లేఖ రాయడం గమనార్హం. రాబోవు రోజుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ మీద మరింతగా పోరాడేందుకు ఈ లేఖ అస్త్రంగా ఉపయోగ పడనుంది. పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రంపై బీఆర్ఎస్ ఇప్పటికే పలు వేదికలపై నిలదీసింది. ప్రత్యేకించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఏపీలో రాజకీయంగా రాచమార్గాన బీఆర్ఎస్ రావడానికి అవకాశం ఏర్పడింది. మంత్రి KTR రాసిన లేఖ కార్మికులను ఆలోచింప చేస్తూఉంది.

అందుకే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశాన్ని మంత్రి కేటీఆర్ భుజానికి ఎత్తుకున్నారు. ఫక్తు రాజకీయ పార్టీగా BRS ఉందని ఎప్పుడో కేసీఆర్ చెప్పారు. అంటే విశాఖ స్టీల్ అంశంలో ఏదో రాజకీయం లేదా షేర్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుందని కల్వకుంట్ల కుటుంబం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అనుమానిస్తారు.

స్టీల్ ప్లాంట్‎కు అవసరమైన ప్రత్యేక ఐరన్ వోర్ గనులను కేటాయించకుండా కేంద్రం మోకాలడ్డిందని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తి ఖర్చులో 60% వరకు పూర్తిగా ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు ప్రైవేట్ కంపెనీలకు ఇబ్బడి ముబ్బడిగా ఐరన్ వోర్, బొగ్గు, ఇతర గనులను కేటాయించడం వల్ల వారి ఉత్పత్తిలో ముడి సరుకుల ఖర్చు కేవలం 40% లోపలనే ఉన్నదని చెప్పారు.

పెద్ద ఎత్తున ముడి సరుకు పైనే ఖర్చు చేయాల్సి రావడంతో.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మార్కెట్లో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో ఉత్పత్తి విషయంలో పోటీపడటంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని విశ్లేషించారు. మార్కెట్లో వాటితో సమాన ధరకు అమ్మాల్సి రావడంతో నష్టాలను ఎదుర్కొంటుందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‎ను అంతిమంగా నష్టాల్లోకి నెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని దుయ్యబట్టారు.

స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ రాసారు. తన లేఖలో కేంద్రం స్టీల్ ప్లాంట్ విషయంలో అనుసరిస్తున్న తీరును తప్పు బట్టారు. మౌలిక వసతుల ప్రాజెక్టులకు అత్యంత కీలకమైన స్టీల్ ఉత్పత్తిని పూర్తిగా ప్రైవేటుపరం చేయాలని చూడడం కేంద్ర ప్రభుత్వ నిబద్ధత లోపాన్ని తేటతెల్లం చేస్తుందని స్పష్టంచేశారు.

స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడంలోనే కేంద్ర ప్రభుత్వం కుట్ర దాగి ఉందన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‏ను పూర్తిగా ప్రైవేటుపరం చేసే ముందు, దాన్ని నష్టాల పాలు చేసి వాటిని సాకుగా చూపించి లక్షల కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా ప్రైవేట్ కార్పొరేట్ మిత్రులకు అప్పజెప్పేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని ఆరోపించారు.

ప్రైవేటీకరణ ప్రయత్నాలను కార్మికులు అడ్డుకుంటున్న వేళ కేంద్రం దొడ్డిదారిన ప్రైవేటుకు కట్టబెట్టే కుతంత్రానికి తెరలేపిందని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని KTR స్పష్టం చేసారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావం తెలపాలని ఏపీ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. సరిగ్గా ఇక్కడే తెలంగాణ సర్కారు అడుగులు ఎక్కడికి వెళ్తాయి అనేది చర్చనీయాంశంగా మారింది.

Also Read:  Jagan April ‘Mood’: అమ్మో జగన్, ఏప్రిల్ ‘మూడ్’ దడ