Kothapalli SubbaRayudu : టీడీపీ గూటికి `పాత కాపు కొత్త‌ప‌ల్లి`?

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి రానున్నారు.

  • Written By:
  • Publish Date - June 2, 2022 / 03:00 PM IST

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు టీడీపీలోకి రానున్నారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో ట‌చ్ లో ఉన్న విష‌యాన్ని గ‌మ‌నించిన వైసీపీ ఆయ‌న‌పై సస్పెన్ష‌న్ వేటు వేసింది. ఎలాంటి నోటీసులు జారీ చేయ‌కుండా ఆయ‌న‌పై వైసీపీ చ‌ర్య‌లు తీసుకుంది. సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీలోని ప‌నిచేసిన ఆయ‌న గోదావ‌రి జిల్లాల్లో బ‌ల‌మైన నాయకుడు. చంద్ర‌బాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా చేశారు. కానీ, ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టిన త‌రువాత మారిన ఈక్వేష‌న్ల క్ర‌మంలో టీడీపీని వీడారు.

1981లో ఇండిపెండెంట్‌గా నరసాపురం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా గెలిచిన సుబ్బారాయుడు. ఆ తర్వాత టీడీపీలో చేరి 1989లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో రెండోసారి గెలిచిన తర్వాత ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా చోటు సంపాదించారు. చంద్రబాబు కేబినెట్‌లోనూ పనిచేశారు. మధ్యలో ఒకసారి నరసాపురం ఎంపీగానూ గెలిచారు. కీల‌క లీడ‌ర్ గా ఎదిగిన కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడు 2009లో చిరంజీవిని న‌మ్ముకుని రాజ‌కీయంగా మునిగిపోయారు. త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన చిరంజీవి పార్టీ పెట్టేస‌రికి 2009లో పీఆర్పీలో చేరిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా డార్క్ లోకి వెళ్లిపోయారు.

కాంగ్రెస్ పార్టీ పీఆర్పీలో విలీనం త‌రువాత 2011లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ త‌రువాత 2014లో వైపీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీకి గుడ్‌బై చెప్పి చంద్రబాబు చెంత‌కు చేరారు. కీల‌క‌మైన‌ కాపు కార్పొరేషన్‌ చైర్మన్ ప‌ద‌విని ఆయ‌న‌కు చంద్ర‌బాబు అప్ప‌గించారు. వివిధ ఈక్వేష‌న్ల న‌డుమ 2019 ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇవ్వ‌కుండా ఆయ‌న్ను ప‌క్క‌న బెట్ట‌డంతో వైసీపీ త‌రపున న‌ర‌సాపురం ఎంపీగా పోటీ చేసిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కు మ‌ద్దతు ప‌ల‌క‌డం ద్వారా తిరిగి జ‌గ‌న్ గూటికి చేరారు. ఆనాటి నుంచి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెద్ద‌గా ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డంలేదు. ఒంగోలులో జరిగిన మ‌హానాడు హిట్ కావ‌డంతో టీడీపీ పెద్ద‌ల‌కు ట‌చ్ లోకి వెళ్లాడ‌ని టాక్‌. అందుకే, సుబ్బారాయుడుపై వైసీపీ స‌స్పెండ్ వేసింద‌ని తెలుస్తోంది.

స‌స్పెన్ష‌న్‌కు కార‌ణ‌మేమిటో చెప్పాల‌ని, లేనిప‌క్షంలో తాను చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటానంటూ వైసీపీకి కొత్తప‌ల్లి అల్టిమేటం ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వైసీపీపై ఒక్క మాట కూడా అన‌లేద‌న్న కొత్త‌ప‌ల్లి, ఏ త‌ప్పు చేయ‌కుండానే పార్టీ వేటు వేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. పార్టీపై నిత్యం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై ఎందుకు సస్పెన్ష‌న్ వేటు వేయ‌డం లేద‌ని నిల‌దీశారు.స‌స్పెన్ష‌న్‌కు గ‌ల కార‌ణాల‌ను మీడియాకు విడుద‌ల చేయాల‌ని, లేదంటేచ‌ట్ట‌ప‌రంగా పోరాటం చేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు.

సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న. కొత్తప‌ల్లి సుబ్బారాయుడు ఇటీవ‌ల జరిగిన జిల్లాల విభ‌జ‌న విష‌యంలో త‌న పంథాను
నెర‌వేర్చుకోలేక‌పోయారు. భీమవ‌రం కేంద్రంగా ఏర్ప‌డిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాను ఆయ‌న వ్య‌తిరేకించారు. జిల్లా కేంద్రంగా న‌ర‌సాపురంను చేయాల‌ని డిమాండ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ సానుకూల స్పంద‌న లేక‌పోవ‌డంతో 2019 ఎన్నిక‌ల్లో వైసీపీకి మ‌ద్ధ‌తు ఇచ్చి త‌ప్పుచేశాన‌ని త‌న చెప్పుతో తాను కొట్టుకుని నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఆనాటి నుంచి పార్టీ హైక‌మాండ్ ఆయ‌న‌పై గుర్రుగా ఉంది. తాజాగా ఆయ‌న టీడీపీతో ట‌చ్ లో ఉన్నాడని తెలుసుకుని స‌స్పెండ్ చేసిన‌ట్టు తెలుస్తోంది.