Durgamma : కార్తిక మాసం సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఇవాళ యమ ద్వితీయ. ఈసందర్భంగా దుర్గమ్మను భక్తులు ఇచ్చిన లక్షలాది గాజులతో అలంకరించారు. దాదాపు 4 లక్షల గాజులతో దుర్గమ్మను సర్వాంగసుందరంగా అలంకరించారు. వివిధ రంగుల గాజులతో అమ్మవారిని(Durgamma) సిద్ధం చేశారు. ఈ అలంకరణలో వెలిగిపోతున్న అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గమ్మకు యమ ద్వితీయ రోజే గాజులు ఎందుకు అలంకరిస్తారు ? అనేది తెలుసుకోవాలంటే ‘భగినీ హస్త భోజనం’పై అవగాహన కలిగి ఉండాలి. భగినీ అంటే సోదరి. యమ ద్వితీయ రోజున సోదరులు తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లాలి. తన ఇంటికి వచ్చిన సోదరుల నుదుటన సోదరి తిలకం దిద్దాలి. అనంతరం సోదరి స్వహస్తాలతో సోదరులకు భోజనం వడ్డించాలి. భోజనం చేసిన అనంతరం సోదరులు ఆమెకు చీర, సారె పెట్టాలి. కార్తీక శుక్ల విదియ రోజు సోదరి ఇంటికి వెళ్లి, ఆమె చేతి వంట తినే సోదరుడి గృహంలో అపమృత్యు దోషాలు ఉండవని స్వయంగా యముడు చెబుతాడు. అందుకే యమ ద్వితీయకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
Also Read :Union Minister : కేంద్ర మంత్రిపై కేసు.. జాతరకు అంబులెన్సులో వెళ్లినందుకు ప్రొసీడింగ్స్
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయంలో పుష్పాలంకరణ నిర్వహించారు. ఆలయంలోని తిరుపతమ్మ, గోపయ్య స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.
Also Read :Google Pay Laddoos : నవంబరు 7 లాస్ట్ డేట్.. ‘గూగుల్ పే’ లడ్డూలతో క్యాష్ బ్యాక్
నంద్యాల జిల్లా శ్రీశైలంకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పాతాళ గంగలో పుణ్య సాన్నాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉత్తర మాడ వీధి, గంగాధర మండపం వద్ద భక్తులు దీపారాధనలు చేశారు. మొత్తం మీద కార్తిక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, శివాలయాలు శివ నామస్మరణతో కిటకిటలాడుతున్నాయి. కార్తిక మాసం నవంబర్ 30న ముగుస్తుంది.