Site icon HashtagU Telugu

YSRCP : సీఎం జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వ‌బోతున్న సొంత జిల్లా ఎమ్మెల్యేలు.. జంపింగ్‌కు సిద్ద‌మైన ముగ్గురు ఎమ్మెల్యేలు..?

Ysrcp

Ysrcp

ఏపీలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ జంపింగ్‌లు జోరందుకోనున్నాయి. పార్టీల్లో అసంతృప్తుల‌తో ఉన్న నేత‌లంతా ప‌క్క పార్టీల్లోకి వెళ్లేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వ మార్పుతో ఏపీలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప‌దేళ్ల త‌రువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో అధికారం చేప‌ట్టింది.ఈ ప్రభావం ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌పై ప‌డే అవ‌కాశం ఉంది.తాజాగా ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు రాజీనామాలు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌కు, వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్న మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 2014లో గెలిచి ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఆర్కే, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌పై కూడా గెలిచారు. అయితే అధికారం వ‌చ్చాక ఆర్కేకి మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశ‌గా ఎదురు చూశారు. రెండో కెబినేట్ విస్త‌ర‌ణ‌లో కూడా ఆయ‌న‌కు చోటు ద‌క్క‌లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌, లోకేష్ చ‌రిష్మాతో ఓడిపోతాన‌ని ఎమ్మెల్యే ఆర్కే పార్టీకి ముందుగానే రాజీనామా చేశార‌ని పొలిటిక‌ల్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు సీఎం సొంత జిల్లా అయిన క‌డ‌ప‌లో కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. త్వ‌ర‌లో క‌డ‌ప జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని సమాచారం. తమ చేరికపై సమాచారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుకు త్వ‌ర‌లో తెలియ‌జేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ ర‌వి ద్వారా ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు చంద్ర‌బాబును త్వ‌ర‌లో క‌ల‌వ‌నున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా స‌మాచారం.ఇటీవ‌ల పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ ర‌విని పోలీసులు అరెస్ట్ చేయ‌డానికి కూడా ఈ జంపింగ్ సీక్రెటే కార‌ణ‌మ‌ని టీడీపీ క్యాడ‌ర్‌లో వినిపిస్తుంది. బీటెక్ ర‌వి పులివెందుల‌లో తెలుగుదేశం పార్టీ నూత‌న కార్యాల‌యాన్ని ప్రారంభించి.. పార్టీలో గ్రామ‌, మండ‌ల స్థాయి నాయ‌కుల‌ను చేర్చుకుంటున్నారు. దీంతో సీఎం జ‌గన్ సొంత ఇలాకాలో వైసీపీకి గ‌డ్డు ప‌రిస్థితి ఏర్ప‌డుంది. ఈ కార‌ణాల చేత‌నే బీటెక్ ర‌విని అరెస్ట్ చేయించార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. క‌డ‌ప జిల్లా నుంచి జంపింగ్ అయ్యే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌ర‌నే స‌స్సెన్ష్ త్వ‌ర‌లోనే వీడ‌నుంది.

Also Read:  Acid Attack : వైజాగ్‌లో వివాహితపై ఆటో డ్రైవర్ యాసిడ్ దాడి