Pavan Kalyan : కాపు నాయ‌కుల‌కు జ‌న‌సేనాని బ‌హిరంగ లేఖ‌.. కుట్ర‌లు, కుయుక్తుల‌తో..?

  • Written By:
  • Publish Date - January 4, 2024 / 11:02 PM IST

వైసీపీకి ఓట‌మి కళ్లేదుటే క‌నిపిస్తోంద‌ని.. అందుకే కొందరు కాపు పెద్ద‌ల‌ను జ‌న‌సేన‌పై రెచ్చ‌గొడుతుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోపించారు. తాను గౌరవించే కాపు పెద్దలు త‌న‌ను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తానన‌ని తెలిపారు. త‌న‌ని దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందని.. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ఖ‌రాఖండీగా చెప్పి.. కాపులనే పావులుగా వాడుకొనే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాల‌ని వారికి సూచించారు. కుట్రలు.. కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దన్నదే కాపు పెద్దలకు త‌న‌ విన్నపమ‌ని తెలిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోందని.. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారన్నారు. అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన అని.. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి పాలక పక్షాన్ని నిలువరించి దేశ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయన్నారు. అదే రీతిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ప్రకటించి.. తాను మొదలుపెట్టిన ఒక కార్యాచరణ వైసీపీకీ, ఆ పార్టీని నడిపే నాయకుడికీ కంటగింపుగా మారిందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీ అసభ్యకర దూషణలకి దిగి, వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డా తట్టుకొని నిలబడుతూనే ఉన్నామ‌ని.. అన్ని సామాజిక వర్గాల్లోనూ నిర్ధిష్టమైన శాతం, కాపు సామాజిక వర్గంలో బలమైన శాతం జనసేనకు అండగా ఉండటం వైసీపీ కి జీర్ణం కావడం లేదన్నారు. ఈ క్రమంలోనే కులపరమైన అస్త్రాన్ని వైసీపీ ప్రయోగిస్తోందని.. రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకువచ్చే క్రమంలోనే వైసీపీ కుట్రలకు తెర తీసిందని ఆయ‌న ఆరోపించారు. కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తోందని.. జనసేనపైనా, త‌న‌పైనా సామాజిక మాధ్యమాల్లో విషపు రాతలు రాయించడం, అపోహలు సృష్టించే తప్పుడు వార్తలను కేవలం కాపు సామాజిక వర్గం వారి మొబైల్ ఫోన్లకు మాత్రమే పంపడం లాంటి దుశ్చర్యలకు ఒడిగడుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధిలో కాపులు కచ్చితంగా పెద్దన్న పాత్ర పోషించాలని తాను బలంగా విశ్వసిస్తానని.. వైసీపీ ప్రాయోజిత విషపూరిత ప్రచారాలను, తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు, వార్తలను విశ్వసించవద్దని కాపు సామాజిక వర్గంతోపాటు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానని ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలిపారు.

Also Read:  TDP : శ్రీకాకుళం జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం.. కార్య‌క‌ర్త‌ల కుటుంబానికి నారా భువనేశ్వ‌రి ఆర్థికసాయం