రాయలసీమ ప్రాంతంలో పార్టీ బలోపేతంపై జనసేన అధిష్ఠానం దృష్టి సారించించింది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సేవలను రాయలసీమలో వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీ రద్దు తర్వాత ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడం, కేడర్ విస్తరణను వేగవంతం చేయడం లక్ష్యంగా జనసేన అధిష్ఠానం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బాలినేనికి మరింత రాజకీయ ప్రాధాన్యం కల్పించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్నూలు, అనంతపురం, కడపతో పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కూడా బాలినేనికి అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు చేపడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇతర పార్టీల నుంచి నాయకులను జనసేనలోకి తీసుకురావడంపై కూడా పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. రాయలసీమలో పార్టీ ప్రభావాన్ని పెంచేందుకు క్షేత్రస్థాయిలో పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే బాలినేనికి సంబంధించిన బాధ్యతలపై జనసేన అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో రాబోయే రోజుల్లో పార్టీ తీసుకునే నిర్ణయాలపై రాజకీయల వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
