Media Coverts : మీడియాలో జ‌న‌సేన కోవ‌ర్టులు! ప‌వ‌న్ కు బ‌ల‌మైన ఫోర్త్‌ ఎస్టేట్!

రాజ‌కీయ పార్టీలు మీడియా మ‌ద్ధ‌తును కోరుకోవ‌డం స‌హ‌జం. ఆ విష‌యంలో తెలుగుదేశం పార్టీ కంటే జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా ప‌ట్టు సాధించింది.

  • Written By:
  • Publish Date - December 24, 2022 / 02:01 PM IST

రాజ‌కీయ పార్టీలు మీడియా మ‌ద్ధ‌తును కోరుకోవ‌డం స‌హ‌జం. ఆ విష‌యంలో తెలుగుదేశం పార్టీ కంటే జ‌న‌సేన వ్యూహాత్మ‌కంగా ప‌ట్టు సాధించింది. ఆ మేర‌కు మీడియా  స‌ర్కిల్స్ లో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ న‌డుస్తోంది. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా  హౌస్ లు చాలా వ‌ర‌కు పార్టీ ప‌రంగా ఉన్నాయ‌ని ఎవ‌ర్ని అడిగినా చెబుతారు. సొంత డబ్బా కొట్టుకోవ‌డానికి టీఆర్ఎస్, వైసీపీ సొంత మీడియాను ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడున్న మీడియాలోని కొంత విభాగాన్ని తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తోంద‌ని ప్ర‌తి రోజూ వినిపించే మాట‌. జ‌న‌సేన‌కు మాత్రం మీడియా స‌పోర్ట్ లేద‌ని ప‌వ‌న్ కూడా ప‌లుమార్లు చెప్పారు. కానీ, ప్ర‌స్తుతం ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే మీడియా హౌస్ ల‌తో పాటు జ‌న‌సేన భావ‌జాలాన్ని వినిపించే వాళ్ల‌ను బుల్లితెర మీద ఆ పార్టీ పాతేసింది. వాళ్లు జ‌న‌సేన కోవ‌ర్టులుగా(Media Coverts) ప‌నిచేస్తున్నార‌ని కొన్ని ఎపిసోడ్ లు, కొంద‌రి భావ‌జాలాన్ని గ‌మ‌నిస్తే అర్థం అవుతోంది.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో..

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ప్ర‌త్యేక‌వాదాన్ని బ‌లంగా వినిపించే వాళ్ల‌ను మీడియా సంస్థ‌ల్లో కేసీఆర్ స్వ‌యంగా రెక‌మండ్ చేసి కొంద‌ర్ని నియ‌మించార‌ని ఆనాడు వినిపించిన టాక్‌. ఉద్య‌మాన్ని బ‌లంగా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకెళ్ల‌డానికి ఆయ‌న వేసిన ఎత్తుగడ అది. అక్క‌డే కేసీఆర్ స‌గం విజ‌యం సాధించారు. అక్ర‌మ సంపాద‌న, ఆస్తులు క‌లిగిన ఆంధ్రా మీడియా ఎక్కువ‌గా ఉండ‌డాన్ని ఆయ‌న స‌ద‌వ‌కాశంగా తీసుకున్నారు. యాజ‌మాన్యానికి నేరుగా ఫోన్లు చేసి ఉద్య‌మ‌కారుల‌ను జ‌ర్న‌లిస్టులుగా(Journalists) కొంద‌ర్ని ప్ర‌ధాన మీడియాలో చొప్పించారు. ఆ త‌రువాత వాళ్లే ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆర్థిక వ‌న‌రులు కూడిన త‌రువాత సొంత మీడియాను కేసీఆర్ ఏర్పాటు చేసుకున్నారు. రెండోసారి సీఎం అయిన త‌రువాత మీడియాలోని సింహ‌భాగాన్ని ప‌రోక్షంగా కైవ‌సం చేసుకున్నార‌ని అంద‌రూ చ‌ర్చించుకునే అంశ‌మే.

ఆనాడు కేసీఆర్ చేసిన మాదిరిగా ప‌వ‌న్ ఇప్పుడు జ‌న‌సేన ప్ర‌మోష‌న్ కోసం కొంద‌ర్ని ప్ర‌ధాన మీడియాలో ఏర్పాటు చేసుకున్నార‌ని టాక్‌. కొన్ని మీడియా సంస్థ‌లు ప‌వ‌న్ కు అనుకూలంగా ఉండే వాళ్ల చేతుల్లో న‌డుస్తున్నాయి. అవి నేరుగా జ‌న‌సేన భావ‌జాలాన్ని, ప‌వ‌న్ రాజ‌కీయిజాన్ని నూరిపోస్తున్నాయి. ఆ మీడియా సంస్థ‌ల్లో సొంత కులం వాస‌న ఘాటుగా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇక‌ ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల్లో జ‌న‌సేన భావ‌జాలాన్ని క‌లిగి ఉన్న సొంత కుల‌పోళ్ల‌ను కొంద‌ర్ని నియ‌మించారు. తెలుగుదేశంకు అనుకూల మీడియాగా ఉన్న సంస్థ‌ల్లో సైతం జ‌న‌సేన కు కోవ‌ర్టులుగా(Media Coverts) ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్ట్ లు ఉన్నార‌ని వినికిడి. ఎన్నిక‌ల నాటికి మ‌రికొన్ని సంస్థ‌ల‌ను తీసుకురావ‌డానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ బినామీలు ముందుకొస్తున్నార‌ని టాక్‌. ప్ర‌ధాన ప‌త్రిక‌ల మ‌ద్ధ‌తు జ‌న‌సేన‌కు త‌క్కువ‌గా ఉంది. కానీ, ఛాన‌ళ్ల విష‌యంలో మాత్రం ప్ర‌ధాన పార్టీల కంటే మిన్నగా ప‌వ‌నిజాన్ని బ‌లంగా వినిపించే మీడియా జ‌న‌సేన‌కు మ‌ద్ధ‌తుగా ఉంది.

జ‌న‌సేన కు కోవ‌ర్టులుగా(Media Coverts)..

ప్ర‌స్తుతం ఉన్న మీడియా ఛాన‌ళ్ల‌లో తెలుగుదేశం, వైసీపీ కంటే జ‌న‌సేన‌కు మ‌ద్ధ‌తు ప‌లికేవి ఎక్కువ‌గా ఉన్నాయ‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. మూడు ఛాన‌ళ్ల ద్వారా జ‌న‌సేన ప్రోమోష‌న్ బాగా జ‌రుగుతోంది. వాటితోడు కొన్ని వెబ్ ఛాన‌ళ్లు, వెబ్ సైట్ లు పుట్ట‌గొడుగుల్లా ప‌వ‌న్ కు మ‌ద్ద‌తుగా ప‌నిచేస్తున్నాయ‌ని వైసీపీ గ్ర‌హించింది. రాబోవు రోజుల్లో మ‌రిన్ని వెబ్ సైట్లు, యాప్ లు, యూ ట్యూబ‌ర్లు రంగంలోకి దిగ‌డానికి జ‌న సైన్యం సిద్ధ‌మైయింద‌ని టాక్‌. ఇవ‌న్నీ ఒక ఎతైతే, విచిత్రంగా తెలుగుదేశంకు అనుకూలంగా ఉండే మీడియా హౌస్ ల్లోనూ ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గంకు చెందిన వాళ్లు కీల‌క స్థానాల్లో ఉంటూ జ‌న‌సేన ప్ర‌మోష‌న్ ప‌రోక్షంగా జ‌రుగుతోంది. ఇలాంటి పరిణామాన్ని ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో చూశాం. ఆనాడు సొంత మీడియా లేక‌పోయిన‌ప్ప‌టికీ కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా జ‌ర్న‌లిస్ట్ ల‌ను త‌యారు చేసి ఆంధ్రోళ్ల మీడియా ద్వారా ప్ర‌త్యేక రాష్ట్ర సెంటిమెంట్ ను ఆకాశానికి లేప‌డాన్ని ఆనాటి హైలెట్ వ్యూహం. ఇప్పుడ‌దే వ్యూహాన్ని జ‌న‌సేన కోసం ప‌వ‌న్ అనుస‌రిస్తున్నార‌ని జ‌ర్న‌లిస్ట్ స‌ర్కిల్స్ లో నడుస్తోన్న చ‌ర్చ‌.

Also Read : Pawan With Balakrishna: బాలయ్య తో పవన్ కళ్యాణ్.. ఓటు చీలుపై చర్చ!

సొంత సామాజిక‌వ‌ర్గంలోని కొంద‌రిని జ‌ర్న‌లిస్ట్ లుగా(Journalists), ప్ర‌జెంట‌ర్లుగా త‌యారు చేసి తెలుగుదేశం అనుకూల మీడియాలోనూ జ‌న‌సేన కోవ‌ర్టులు కీల‌కంగా ఉన్నారు. ఓటీటీ, రియాల్టీ షోల్లోనూ, ఇత‌ర మీడియా వేదిక‌ల‌పై కొంద‌రు జ‌న‌సేన ప్ర‌మోష‌న్ చేయ‌డాన్ని చూస్తుంటే కేసీఆర్ త‌ర‌హాలో ప‌వ‌న్ బ‌లంగా పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని అర్థం అవుతోంది. రాబోవు రోజుల్లో తెలుగుదేశం, జ‌న‌సేన పొత్తు అంటూ ప్ర‌చారం బ‌లంగా జ‌రుగుతున్న క్ర‌మంలో ఈ మొత్తం వ్య‌వ‌హారం వ్యూహాత్మ‌కంగా న‌డిచింది. విచిత్రంగా ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం ఏర్పాటు చేసిన మీడియా హౌస్ ల్లో చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గానికి ఏ మాత్రం చోటు లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. మొత్తం మీద ప‌వ‌న్ ఇటీవ‌ల చెప్పిన ష‌ణ్ముఖ వ్యూహంలో ఇదో ఎత్తుగ‌డ‌గా ప్ర‌చారం జ‌రుగుతోంది.