Ys Jagan Plan B: రాజధానిపై జగన్‌ ప్లాన్‌ బీ.. మావిగన్ పేరుతో తెరపైకి కొత్త ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ అమరావతితో సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదన్నారు. అలాగే ప్లాన్ బీ అంటూ సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కేపిటల్ ఏరియాగా ప్రకటించాలన్నారు. ఈ ప్రాంతానికి కొత్త పేరును సూచించారు. భవిష్యత్తులో ఇది గ్రోత్ ఇంజిన్ అవుతుందని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శాసనసభలో […]

Published By: HashtagU Telugu Desk
Jagan

Jagan

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌సీపీ అమరావతితో సహా ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదన్నారు. అలాగే ప్లాన్ బీ అంటూ సరికొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కేపిటల్ ఏరియాగా ప్రకటించాలన్నారు. ఈ ప్రాంతానికి కొత్త పేరును సూచించారు. భవిష్యత్తులో ఇది గ్రోత్ ఇంజిన్ అవుతుందని జగన్ చెప్పుకొచ్చారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదమే లేదని, అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో తమ ప్లాన్ -A ఫలించలేదని, ప్లాన్ బీ అంటూ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు కేపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయాలని, ఆ కేపిటల్ ఏరియాకు ‘మావిగన్’ అని పేరు పెట్టాలని సూచించారు. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 110 కిలోమీటర్లను ‘కేపిటల్ ఏరియా కారిడార్‌’గా డిక్లేర్ చేయాలన్నారు.

దానికి ‘MA-VI-GUN’ (మావిగన్-మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) అని పేరు పెడితే, ఈ ప్రాంతం భవిష్యత్తులో గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు. ఈ మూడు ప్రాంతాల్లో 40 లక్షల జనాభా ఉన్నారని, కాస్త ఖర్చు పెడితే బాగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. వైఎస్సార్‌సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, ఏ ప్రాంతానికీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని జగన్ అన్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదని, ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయని పేర్కొన్నారు.

2014-2019 మధ్య ఐదేళ్లు, 2024 నుంచి 2026 వరకు రెండేళ్లు కలిపి మొత్తం ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతికి ఏం చేశారు? భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా అంటూ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు 2014 నుంచి 2026 వరకు ఈ 12 ఏళ్లలో అమరావతిలో మనస్ఫూర్తిగా లేరన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు హైదరాబాద్‌లో ఉంటున్నారని, వీరు హైదరాబాద్‌కు షటిల్ సర్వీసు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో నాలుగు రోజులు కూడా ఉండటం లేదన్నారు. అమరావతిలో 10వేల ఎకరాల్లో బెస్ట్ కేపిటల్ అని చెప్పారని, ఇప్పుడు మున్సిపాల్టీగానే మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారంటూ ప్రశ్నించారు. అమరావతిపై తీర్మానం పేరుతో చంద్రబాబు అసెంబ్లీలో కొత్త డ్రామా ఆడారని జగన్ అన్నారు. అసెంబ్లీని జగన్‌ను, వైఎస్సార్‌సీపీని దుమ్మెత్తి పోయడానికి వాడుకున్నారన్నారు. అమరావతి విషయంలో చంద్రబాబు అవినీతి బయటపెడతారనే శాసనమండలి సమావేశం నిర్వహించలేదని మాజీ సీఎం అన్నారు.

ఏ చట్టాన్నైనా చట్టసభలు తయారు చేయగలవు, ఆ చట్టాలను చట్టసభలు సవరించగలవు. కానీ ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్‌ ఇస్తున్నారు, అవినీతి నుంచి డైవర్ట్‌ చేయడానికే ఈ డ్రామాలు. అమరావతి పేరుతో ముందు 50వేలకుపైగా ఎకరాలు తీసుకుని ఏం చేశారు? ఇప్పుడు మళ్లీ మరో 50వేల ఎకరాలని ఎందుకు అంటున్నారు? ఉన్నట్టుండి మాస్టర్‌ ప్లాన్‌ను ఎందుకు మారుస్తున్నారు? రాజధాని పేరిట చేస్తున్న దోపిడీ నుంచి పక్కదోవ పట్టించడానికే అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు. రాజధాని పేరిట పట్టపగలు దోపిడీ చేస్తున్నారు, లక్ష ఎకరాల అమరావతిలో ఇంతవరకూ కట్టింది ఎంత? నిజంగా అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్ట్‌ అయ్యిందా? రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అంటూ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ ప్రశ్నించారు.

  Last Updated: 01 Apr 2026, 01:38 PM IST