AP Govt – Civil Services : దేశంలో ప్రతి సంవత్సరం జరిగే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి సగటున దాదాపు 40 మంది ఎంపికవుతున్నారు. ఈ సంఖ్యను మరింత పెంచే లక్ష్యంతో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సివిల్స్ ప్రిపరేషన్ లో అండగా నిలిచేందుకు ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ అనే కొత్త పథకాన్నిఅమల్లోకి తెచ్చింది. దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి అక్టోబరు 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్లతో సాంఘిక సంక్షేమ శాఖ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను సమర్పించాలని కోరారు. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల సివిల్స్ అభ్యర్థులకు దీని ద్వారా ఆర్థిక సాయం లభించనుంది.
We’re now on WhatsApp. Click to Join.
సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో అర్హత సాధించే అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత సాధించే వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. నేరుగా అభ్యర్థుల ఖాతాల్లోనే ఈ మొత్తాన్ని జమ చేస్తారు. సివిల్స్ ఎగ్జామ్ రాసిన ప్రతిసారీ ఈ పథకం నుంచి లబ్ధి పొందొచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కుటుంబం వార్షికాదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించకూడదు. ఈమేరకు కుటుంబ ఆదాయ స్వీయ ధృవపత్రం, ఇంటిలోని ఉద్యోగి జీతం ధృవపత్రం, తాజా పన్నుకు సంబంధించిన సర్టిఫికెట్లను సమర్పించాలి. కుటుంబానికి 10 ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి గానీ, మొత్తం 25 ఎకరాల మాగాణి, మెట్ట భూమి (AP Govt – Civil Services) ఉండొచ్చు.