ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan)పై నమోదైన సింగయ్య మృతి కేసులో హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్(Quash Petition)పై విచారణ మరోసారి వాయిదా పడింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జరిగిన ఈ ఘటనలో జగన్ కాన్వాయ్ కారణంగానే కార్యకర్త సింగయ్య మృతి చెందాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ జగన్, ఇతర వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ జులై 1వ తేదీకి వాయిదా వేస్తూ, అప్పటివరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది.
Space City : ఏపీలో స్పేస్ సిటీల ఏర్పాటు..30 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు
విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కేసుకు కొత్త మలుపు తిప్పాయి. “కారు ప్రమాదం జరిగితే, కారులో ఉన్నవారిపై ఎలా కేసు పెడతారు?” “ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?” అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు ఉదాహరణగా “కుంభమేళాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తొక్కిసలాట జరిగింది కదా” అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలతో పోలీసుల చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి.
ఈ కేసులో జగన్‌తో పాటు ఇతర వైఎస్సార్సీపీ నేతలు దాఖలు చేసిన ఐదు క్వాష్ పిటిషన్లను కలిపి హైకోర్టు విచారిస్తోంది. జగన్ వర్గం ప్రకారం.. ఈ కేసు ద్వారా రాజకీయంగా మలుపు తిప్పే ప్రయత్నం జరుగుతోందని, ప్రజల మధ్యకి వెళ్లకుండా అడ్డుకునేందుకు తలపెట్టిన కుట్రగా వర్ణిస్తున్నారు. మరోవైపు సింగయ్య మృతి కేసు రాజకీయం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో దీనిపై చర్చలు మళ్లీ జోరుగా సాగుతున్నాయి.