వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి (Jagan) ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం ప్రారంభించగా, అది బెడిసికొట్టింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేయాలని జగన్ పిలుపు ఇచ్చారు. జూలై 1 నుంచి నాలుగు దశల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అయితే ఈ పిలుపునకు వైఎస్సార్‌సీపీ నేతల నుండి పెద్దగా స్పందన లేకుండాపోయింది. గడపగడపకు వెళ్లి చంద్రబాబు అమలు చేయని హామీలను ఎండగట్టాలంటూ జగన్ ఇచ్చిన ఆదేశాలను నేతలు పట్టించుకోకపోవడం జగన్ ను అసంతృప్తికి గురిచేసింది.
PM Modi : ఘనా అత్యున్నత పురస్కారంతో మోడీ సత్కారం: భారత-ఘనా బంధానికి కొత్త అధ్యాయం
కృష్ణా, నెల్లూరు, గుంటూరు, కడప జిల్లాలో బలమైన బేస్ ఉన్న ప్రాంతాల్లోనూ పార్టీ క్యాడర్ చురుకుగా పాల్గొనకపోవడం గమనార్హం. ముఖ్యంగా జగన్ స్వంత జిల్లా అయిన కడపలోనే ఈ కార్యక్రమం అమలు కాకపోవడం పార్టీ పరిస్థితిని స్పష్టంగా చాటుతోంది. మొట్టమొదటి దశలో 35 నిమిషాలపాటు జగన్ ప్రసంగాన్ని భారీ స్క్రీన్‌లపై ప్రదర్శించాలని చెప్పినా, చాలా చోట్ల ఆ స్క్రీన్లు ఏర్పాటే కాలేదు. ప్రజల్లోకి వెళ్లి చర్చ ప్రారంభించాలన్న జగన్ ఆలోచనను క్యాడర్ కార్యరూపంలోకి తేవడంలో విఫలమయ్యారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య తిరిగే ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదన్నదే అనేక కార్యకర్తల అభిప్రాయం.
ఇదే సమయంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం “సుపరిపాలన తొలి అడుగు” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా ప్రచారం కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను వివరించడమే కాకుండా, ప్రభుత్వ హామీలు ఎలా అమలవుతున్నాయో కూడా వివరిస్తున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన కార్యకమానికి పుంజుకునే అవకాశం లేకుండా పోయింది. దశల వారీగా జరుగాల్సిన కార్యక్రమం పార్టీ స్థాయిలోనే స్తబ్దుగా మారిపోవడంతో జగన్ వేసిన వ్యూహం బెడిసికొట్టిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.