ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan) తీవ్రంగా స్పందిస్తూ వరుస ప్రజాపర్యటనలు చేపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో మొదలుపెట్టి, ఇటీవల చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో పర్యటించిన జగన్, ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు చేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజల్ని కలుసుకొని మద్దతు ఇస్తున్నారు.
ఈ నెల 31వ తేదీన జగన్ నెల్లూరు (Nelluru) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో కలిసి, తెలుగుదేశం పార్టీ అనుచరుల దాడిలో నష్టపోయిన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించనున్నారు. కోవూరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న వేళ, జగన్ స్వయంగా వచ్చి పరామర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాడిలో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రసన్నకు ధైర్యం చెప్పడం, మద్దతుగా నిలవడమే ఈ పర్యటన లక్ష్యంగా ఉంది.
Saiyaara : వామ్మో ఇది పేరుకే చిన్న సినిమా…బాక్స్ ఆఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్
నిజానికి జగన్ ఈ పర్యటనను ఈ నెల 3వ తేదీనే నిర్వహించాల్సి ఉండగా, అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన హెలికాప్టర్‌ను దిగనివ్వబోమని హెచ్చరించడంతో పర్యటన వాయిదా పడింది. రాజకీయంగా ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్న జగన్, ఇప్పుడు తిరిగి నెల్లూరులో పర్యటన చేయనున్నట్టు వైఎస్సార్సీపీ సీనియర్ నేత కారుమూరి నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ పర్యటన రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారనుంది.
జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా సమన్వయకర్తలతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు. పర్యటన విజయవంతం కావాలంటే ప్రతి నియోజకవర్గంలో పార్టీ నేతలు సమన్వయంగా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. ఇక మాజీ ముఖ్యమంత్రి పునరాగమనం నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని రాజకీయ ఉత్సాహం పెరిగింది. జగన్ పర్యటనతో జిల్లా రాజకీయాల్లో కొత్త ఊపు రావడం ఖాయమని వైఎస్సార్సీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.