Site icon HashtagU Telugu

AP CM Jagan: జగన్ మంచోడే.! సజ్జలే చేటు!! రెబెల్స్ వాయిస్

Jagan Is Great! Sajjala Chetu!! Rebels Voice..

Jagan Is Great! Sajjala Chetu!! Rebels Voice..

Jagan is Great : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోటరీ ఆయన్ను ముంచేసిందా? అంటే ఔను అంటూ ముక్తకంఠంతో రెబెల్స్ వాయిస్ వినిపిస్తున్నారు. తాడేపల్లి ఆఫీస్ ను అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించారని రెబెల్స్ ఆదివారం ఆరోపించారు. ఎమ్మెల్యే లకు , జగన్మోహన్ రెడ్డి కి మధ్య అగాధం కలిగేలా సజ్జల చేశారని దుయ్యబట్టారు. రాజ్యాంగేతర శక్తిగా ఉన్నారని సస్పెండ్ అయిన నలుగురు ముక్తకంఠంతో ఆరోపించారు. ఉండవల్లి శ్రీదేవి తనకు ఏపీలో ఏదైనా జరిగితే సజ్జల కారకుడు అవుతారని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ముందు జాగ్రత్తగా జాతీయ ఎస్సీ కమిషన్ కి కూడా ఫిర్యాదు చేసిన తరువాతనే ఏపీలో అడుగుపెడతాను అని అంటున్నారు. జగన్ మంచోడే అని కూడా అంటున్న పరిస్థితి ఉంది. జగన్ మంచి హృదయం ఉన్న వారు. ఆయన నా లాంటి ఒక డాక్టర్ కి ఎమ్మెల్యే అయ్యే చాన్స్ ఇచ్చారు అని ఉండవల్లి అంటూ ఎప్పటికీ జగన్ మీద తనకు గౌరవం అలాగే ఉంటుందని అన్నారు. కానీ అదే జగన్ చెప్పుడు మాటలు వింటున్నారు అన్నదే తన బాధ ఆవేదన అని ఆమె చెప్పడం విశేషం.

ఆనం కూడా రాజ్యాంగేతర శక్తిగా ఒకరు ఉన్నారని సజ్జల మీద విమర్శలు చేశారు. సజ్జల మీద కోటం రెడ్డి అయితే సవాళ్ళే చేశారు. జగన్ (Jagan) కి మంత్రులకు ఎమ్మెల్యేలకు పార్టీ నేతలకు మధ్య అతి పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఆ అంతరానికి కారకులు సజ్జల అన్నదే ఇపుడు చర్చగా ఉంది. నిజానికి జగన్ దాకా ఏ విషయం వెళ్లడం లేదు అని కూడా అంటున్న వారు పార్టీ లోపల చాలా మంది ఉన్నారు. జగన్ అపాయింట్మెంట్ కోసం ఎవరైనా కోరినా ఆ సంగతి ఆయన దాకా చేరుతుందో లేదో అన్న వారూ ఉన్నారు. 151 సీట్లతో ప్రజలు ఎన్నుకున్న సీఎం గా జగన్ ఉన్నారు. జగన్ ఆలోచనలు కూడా ప్రజల కోసమే అని నమ్మే వారిలో ఆయనని విభేదించి బయటకు వచ్చిన వారూ ఉన్నారు. కానీ జగన్ కి పార్టీకి మధ్యలో కొన్ని శక్తులు చేరి ఇలా చేస్తున్నాయని అంటున్నారు. టోటల్ గా సజ్జల మీదనే అంతా విమర్శలు చేస్తున్నారు. ఆయన వేల కోట్లు సంపాదించుకున్నారని ఆనం లాంటి సీనియర్ చేసిన సీరియస్ ఆరోపణలకు విలువ ఉండకుండా ఎలా ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతోంది.

పార్టీలో ఏమి జరుగుతోందో అన్నది అధినాయకత్వానికి తెలుస్తోందా లేక తాము చేసిన విమర్శలను వక్రీకరించి చూపే వారి మాటలనే నమ్ముతోందా అన్నదే ఎమ్మెల్యేల అవేదనగా కనిపిస్తోంది. నిజానికి ప్రతీ ఎమ్మెల్యే రెండు లక్షల మంది ప్రజల చేత ఎన్నుకోబడి వస్తారు. వారి తమ నియోజకవర్గానికి రాజు. వారినే జనాలు ఏ సమస్య అయినా అడుగుతారు. అలాంటి పరిస్థితులలో వారు ఏమీ చేయలేక ఉత్సవ విగ్రహాల మాదిరిగా ఉండిపోతే అది వారి పదవికే అవమానం. సీనియర్లు అయితే అసలు ఇలాంటివి భరించలేరు. ఆనం కూడా తరచూ తన ప్రాంత సమస్యలను మాట్లాడేవారు. అధికారుల మీద ఆయన విమర్శలు చేసేవారు. అది ఎలా తప్పు అవుతుంది అన్నదే పెద్దాయన ఆవేదన. ఇక్కడ మరో విషయం ఉంది మేకపాటిది ఆనం ది ఒక్కటే సమస్య.

ఈ ఇద్దరి నియోజకవరాలలో కొత్తగా వేరే వారిని నియమించి వారి ద్వారా అజమాయిషీ చేయడానికి చూసారని తమను అవమానించారని అంటున్నారు. కోటం రెడ్డి చెప్పే విషయం ఏంటి అంటే తాను నియోజకవర్గం అభివృద్ధి కోసమే మాట్లాడాను తప్ప వేరొకటి కాదని ఉండవల్లి శ్రీదేవి అంటున్నదీ అదే. తాను పార్టీ లైన్ దాటకుండా నాలుగేళ్ళు పనిచేశానని కరోనా టైం లో సైతం పార్టీని లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించాను అని అంటున్నారు. అలాంటి తనను కుట్ర చేసి చెప్పుడు మాటలు విని పంపేసారు అని అంటున్నారు. మరి అలా చెప్పుడు మాటలు చెప్పేవారు ఎవరు. అసలు సజ్జల మీద ఎందుకు ఈ విమర్శలు వస్తున్నాయి.

సజ్జలను ఏకంగా రాజ్యాంగేత శక్తిగా అభివర్ణిస్తున్నారు. జగన్ (Jagan) చుట్టూ భజన బృందం ఉంటుందని ఆనం అంటున్నారు. సజ్జల వేల కోట్లు సంపాదించారని కూడా ఆయన విమర్శల బాణాలు విసిరారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే సజ్జలనే ఎక్కువగా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇక మేకపాటి కూడా జగన్ చుట్టూ ఉన్న వారు మహానుభావులు వారంతా కలసి ఏదో రోజున వైసీపీని ముఖ్యమంత్రి జగన్ని కూడా అవమానకరమైన పరిస్థితికి తీసుకెళ్తారు అని విమర్శించారు. వైసీపీ లోగుట్టును సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు చెప్పేశారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో మొదలుపెడితే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఆనం రామనారాయణరెడ్డి ఉండవల్లి శ్రీదేవి అంతా కూడా జగన్ కంటే కూడా ఎక్కువగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీదనే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్తుతుల్లో జగన్ తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.

Also Read:  Rahul Gandhi : తెలుగు రాష్ట్రాల్లోని నేతల బూతులు కంటే రాహుల్ నేరం చేశారా?