Site icon HashtagU Telugu

supreme court : జగన్‌ అక్రమాస్తుల కేసులు..సీబీఐ, ఈడీలకు సుప్రీంకోర్టు ఆదేశం

Jagan illegal assets cases..Supreme orders CBI and ED

Jagan illegal assets cases..Supreme orders CBI and ED

Jagan Illegal Assets Cases : ఏపీ మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసుల పూర్తి వివరాలు రెండు వారాల్లోగా అందించాలని పేర్కొంది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్‌ అప్లికేషన్ల వివరాలు అందించాలని చెప్పింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్‌ రూపంలో అందించాలంది. అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం ఆదేశించింది.

కాగా, మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ ఆలస్యం అవుతోందని ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కోర్టులో గతంలో పిటిషన్‌ వేశారు. కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అటు రోజువారీ విచారణకు ఇప్పటికే తెలంగాణ హైకోర్టు ఆదేశించినట్టు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలోనే విచారణకు ఎందుకు ఇంత ఆలస్యం అవుతోందని న్యాయవాదులను ధర్మాసనం ప్రశ్నించింది. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు ఇస్తే తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం చెప్పింది. తదుపరి విచారణకు ఈ నెల 13కు వాయిదా వేసింది.

ఇకపోతే..జగన్ కు గతంలో అక్రమస్తుల కేసులో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని రఘురామ కృష్ణంరాజు రెండు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల సీజేఐ బెంచ్ లోని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ‘నాట్ బిఫోర్ మీ’ అన్న సంగతి తెలిసిందే. దీంతో… సీజేఐ జస్టిస్ సంజీవి ఖన్నా ఈ పిటిషన్ విచారణను మరో బెంచుకు మార్చారు. ఈ నేపథ్యంలో రఘురామ రాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని మరో బెంచ్ కు గత నెలలో బధిలీ చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు ఈ పిటిషన్లపై స్పందించిన అభయ్ ఓకా… సీబీఐ, ఈడీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Shobitha Suicide Case: కన్నడ నటి శోభిత ఆత్మహత్యా.. కారణాలు తెలియాల్సి ఉంది?