ఏపీ లిక్కర్ స్కాం (AP Liquor Scam) రాజకీయ వేడి పెరుగుతున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణికం ఠాగూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి కేవలం ఓ పావు మాత్రమేనని, అసలు మాస్టర్ మైండ్‌లు వైఎస్ జగన్, ఆయన భార్య భారతి అని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ నేతృత్వంలో ఈ స్కాం ఒక ప్లాన్డ్ ఆపరేషన్‌గా అమలయ్యిందని, ఇది టాప్-డౌన్ అవినీతి విధానం అని పేర్కొన్నారు. మద్యం ద్వారా పేదల జీవితాలను నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేసిన ఈ కుట్ర వెనక జగన్ కుటుంబం ఉన్నదని మండిపడ్డారు.
మాణికం ఠాగూర్ వివరించిన ప్రకారం.. విశ్వసనీయ మద్యం బ్రాండ్లను తొలగించి, వైసీపీకి అనుబంధ బినామీలు నడిపించే కంపెనీల మద్యం బ్రాండ్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. ఈ బ్రాండ్లను అధిక ధరలకు విక్రయించి మేడ్-అప్ లాభాల ద్వారా వేల కోట్ల రూపాయలు ఆర్జించారని ఆరోపించారు. ఈ డబ్బు ప్రజల జేబులో నుంచి లాక్కొన్నట్టేనని, ఎన్నికల ఖర్చులకే దాన్ని వినియోగించారని తెలిపారు. ఇన్‌వాయిసులు, షెల్ కంపెనీలు, వేర్‌హౌస్ ఒప్పందాల పేరుతో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొన్నారు.
Drinking Tea: సాయంత్రం వేళలో టీ తాగుతున్నారా? అయితే జాగ్రత్త!
2020 నుంచి 2024 మధ్యకాలంలో ఈ స్కాం ద్వారా కనీసం రూ. 3,200 కోట్ల నిధులు అక్రమంగా మళ్లించారని మాణికం ఠాగూర్ తెలిపారు. ఈ నిధులను 2024 ఎన్నికల సమయంలో ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయడానికి ఉపయోగించారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో బూత్‌లు నిర్వహించడానికి, ఓటు కొనుగోలుకు ఈ డబ్బును వినియోగించారని స్పష్టం చేశారు. తక్కువ నాణ్యత కలిగిన మద్యం బ్రాండ్ల తయారీకి సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా, లైసెన్సులు తీసుకొని నకిలీ యూనిట్ల ద్వారా సరఫరా చేసిన తీరు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టిన చర్యగా పేర్కొన్నారు.
ఇది జగన్‌కు సంబంధించిన మొదటి అవినీతి కేసు కాదని, గతంలో సీబీఐ దాఖలు చేసిన రూ. 43,000 కోట్ల అక్రమాస్తుల కేసులో కూడా ఆయన ప్రధాన నిందితుడని మాణికం ఠాగూర్ గుర్తుచేశారు. 2012లో జగన్ 16 నెలలపాటు జైలులో ఉన్నారు. ఇసుక మాఫియా, మైనింగ్, భూ కేటాయింపులు, అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ వంటి ఎన్నో అవినీతి వ్యవహారాల తరువాత, మద్యం కుంభకోణం ఆయన అవినీతి ధోరణికి తాజా ఉదాహరణ అని మండిపడ్డారు. ఈ స్కాంలో బాధితులు రాష్ట్రంలోని కోటి పేద కుటుంబాలే అని, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడిన జగన్‌కు తగిన శిక్ష పడాల్సిన సమయం వచ్చిందని ఠాగూర్ పేర్కొన్నారు.