YS Jagan: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో.. రాష్ట్ర ప్రభుత్వంలో దోపిడి రాజ్యమేలుతోందంటూ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు జగన్ వ్యాఖ్యానించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓసారి తన పాలనను గుర్తుచేసుకున్నారేమోనని కొందరు.. ప్రజల దృష్టి మరల్చేందుకు అసత్య ప్రచారానికి తెరలేపారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇప్పటివరకు ప్రవేశపెట్టలేకపోయిందని జగన్ చెప్పారు. అదే సమయంలో ఈ పరిస్థితికి తానే కారణమని జగన్ మాత్రం చెప్పుకోలేకపోయారు. ఓ రాష్ట్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే.. ఆర్థిక వనరులు ఉండాలి. అప్పులపై రాష్ట్రాన్ని నడిపిస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కొన్ని దేశాల ఆర్థిక పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. 2019 నుంచి 2024 వరకు సీఎంగా ఉన్న జగన్.. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల రాష్ట్రంగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఖజనాను పూర్తిగా ఖాళీ చేయడంతో పాటు.. ఆదాయ వనరులను పెంచేందుకు ఎటువంటి ప్రయత్నం చేయలేదనేది బహిరంగ రహస్యం. చెప్పుకోదగ్గ పరిశ్రమలను తీసుకురావడంలో జగన్ ఫెయిల్ అయ్యారనే ప్రచారం జరిగింది.
ఉపాధి, ఉద్యోగ కల్పనలోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యారనే చర్చ జరిగింది. వీటన్నింటిని మర్చిపోయి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను పెట్టలేకపోయిందని విమర్శించడంతో.. కూటమి నేతలు జగన్‌కు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. రాష్ట్రాన్ని ఐదేళ్లపాటు సర్వనాశనం చేసి వదిలేయడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని, ప్రస్తుతంత రాష్ట్రంలో ఆర్థిక వనరులను, ఆదాయ మార్గాలను పెంచే పనిలో ప్రభుత్వం ఉందని, గత వైసీపీ ప్రభుత్వంలా అంకెల గారడీతో ప్రజలను మోసం చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కూటమి నేతలు చెబుతున్నారు. ఓ రకంగా జగన్ గత అసమర్థ పాలన కారణంగానే కొత్త ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల తర్వాత కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేకపోయిందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు జగన్ పైనా లోకేశ్ ధ్వజమెత్తారు. “జగన్ చేసిన లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతుంది. విచారణ పూర్తయితే లిక్కర్ స్కాంలో ఉన్న అందరిపైనా చర్యలు ఉంటాయి. ఎవరు చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే వారిపై చర్యలు ఉంటాయి… జగన్ ఎందుకు కంగారు పడుతున్నాడు?” అని ప్రశ్నించారు. ఇక, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గతంలో టీడీపీ తరపున వాదించిన అడ్వొకేట్లపై కూడా దాడులు చేశారు, వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. 2019లో బ్లూ మీడియా సాక్షి విశాఖ ఎడిషన్ లో నాపై ఫేక్ న్యూస్ పబ్లిష్ చేసింది. దానిపై నేను 75కోట్లకు పరువునష్టం దావా వేశాను. వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ వాహనం గానీ, వసతి వినియోగించలేదు. ఫ్లయిట్ టిక్కెట్లు కూడా నేనే కొనుక్కుంటున్నాను. ప్రజాజీవితంలో మేం బాధ్యతగా మెలిగే వాళ్లం. మూడోసారి విశాఖకు వచ్చాను. నేను పాదయాత్రలో వాడిన బస్సులోనే విశాఖ పార్టీ కార్యాలయంలో బసచేస్తున్నా.. అన్నారు.
Read Also: Revanth Vs KTR : రేవంత్ సవాల్ ను స్వీకరించిన కేటీఆర్..!!