ఈసారి మే నెల (May Month) ఎండలతో కాకుండా వర్షాలతో చల్లగా గడుస్తుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా మే అంటే మండుతున్న ఎండలు గుర్తుకొస్తాయి, కానీ ఈసారి వాతావరణం చల్లగా ఉండబోతున్నదనే విషయం ప్రజలకు ఊరటనిస్తోంది. ఈ నెలంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
Dry Fruits: డయాబెటిస్ ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, కొత్తగూడెం, నల్గొండ ప్రాంతాల్లో ఉదయం మోస్తరు వర్షాలు కురిసిన తర్వాత ఎండలు పడే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మచిలీపట్నం వంటి తీర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో మాత్రం వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఏపీలో వాతావరణ శాఖ ప్రకారం, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ, వానలు లేని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. తెలంగాణలో ఉత్తర, నైరుతి ప్రాంతాల్లో 39 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు పెరగవచ్చు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో గంటకు 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిడుగుల ప్రమాదం ఉన్నందున రక్షిత ప్రదేశాల్లో ఉండాలని అధికారుల సూచన.