Site icon HashtagU Telugu

AP : అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్‌ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు

IT Department orders for setting up Quantum Valley Park in Amaravati

IT Department orders for setting up Quantum Valley Park in Amaravati

AP :  రాష్ట్ర రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి సంబంధించి ఐటీ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే నైపుణ్య సంస్థలతో కుదుర్చుకున్న ఎంవోయూ (Memorandum of Understanding) ను అధికారికంగా ర్యాటిఫై (Ratify) చేసింది. ఈ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి మూడింటి పైగా ప్రముఖ దేశీయ-అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యంగా ముందుకు వస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L&T), అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పార్క్ నిర్మాణం పూర్తి కావడానికి లక్ష్యంగా 2026 జనవరి 1ని గడువుగా నిర్దేశించారు.

Read Also: Vemulawada : రాజన్న గోశాలలో ఎనిమిది కోడెలు మృతి..భక్తులు ఆగ్రహం

IBM సంస్థ ఈ పార్క్‌లో అత్యాధునిక 156 క్యూబిట్ క్వాంటం సిస్టం-2ను ఏర్పాటు చేయనుంది. ఇది క్వాంటం కంప్యూటింగ్ రంగంలో కీలక ముందడుగుగా భావించబడుతోంది. ఈ సిస్టం, ప్రపంచంలోనే అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్న క్వాంటం కంప్యూటర్లలో ఒకటిగా నిలవనుంది. పరిశోధనలు, డేటా ప్రాసెసింగ్, సెక్యూరిటీ సొల్యూషన్స్‌లకు ఇది కీలకంగా ఉపయోగపడనుంది. ఇక, టీసీఎస్ సంస్థ, ఈ పార్క్‌లో క్వాంటం కంప్యూటింగ్ సేవలు, పరిశోధన, సొల్యూషన్స్ డెవలప్‌మెంట్, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్ వంటి సేవలను అందించనుంది. టీసీఎస్ క్వాంటం రంగంలో ఇప్పటికే అనేక ప్రయోగాత్మక ప్రాజెక్టులు చేపట్టిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి మరింత మౌలిక సదుపాయాలను అందించనుంది.

లార్సన్ అండ్ టూబ్రో సంస్థ ఈ టెక్నాలజీ పార్క్‌లో క్లయింట్ నెట్‌వర్క్‌లు, స్టార్టప్‌ల నిర్వహణకు కావలసిన ఇంజినీరింగ్ నైపుణ్యాలను అందించనుంది. మౌలిక సదుపాయాల రూపకల్పనతో పాటు, పార్క్‌లో వినూత్న శోధనలకూ గట్టు వేయనుంది. స్టార్టప్‌లకు మెంటరింగ్, కార్యాలయ స్థలం, టెక్నికల్ సపోర్ట్ వంటి అంశాల్లో ఎల్‌అండ్‌టీ కీలక పాత్ర పోషించనుంది. ఈ క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ప్రారంభం రాష్ట్రానికి మాత్రమే కాక, దేశానికి కూడా ఒక మైలురాయిగా నిలవనుంది. విశ్వవిద్యాలయాల నుండి పరిశోధన కేంద్రాల దాకా, యువశక్తికి వినూత్న ఆవిష్కరణలకు ఇది వేదిక కానుంది. క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సెక్యూరిటీ రంగాల్లో రాష్ట్రం కీలక హబ్‌గా ఎదగనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీనికి పూర్తి మద్దతు లభిస్తుండగా, కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం కూడా చర్యలు చేపట్టారు. విద్యా, పరిశోధన రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులకు నాంది పలికే అవకాశముంది.

 Read Also: India-US: భారత్‌తో వాణిజ్యఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైంది: ట్రంప్‌