YS Jagan Vs Arrest : వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన ఏపీ లిక్కర్ స్కాంపై ‘సిట్’ దర్యాప్తు రాకెట్ వేగంతో జరుగుతోంది. దీంతో కొందరి గుండె దడ పెరిగిపోతోందట. శరవేగంగా అరెస్టులు జరిగిపోతుంటే.. ఎక్కడ తమవంతు వస్తుందోనని హడలిపోతున్నారట. ఇలా కలత చెందుతున్న వారి లిస్టులో వైఎస్ జగన్ పేరు కూడా ఉందనే ప్రచారం ఓ వర్గం మీడియాలో జరుగుతోంది. మీడియా సంగతి అలా ఉంచితే.. వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవలే మీడియా సమావేశంలో చెప్పిన మాటల్లోనూ ‘అరెస్టు’ ముచ్చట ఉంది. ‘‘లిక్కర్ కేసులో కూటమి సర్కారు జగన్‌ను అరెస్టు చేసి తీరుతుంది. జగన్ అరెస్టే లక్ష్యంగా తప్పుడు ఆధారాలను, సాక్ష్యాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు, మాజీ అధికారులను అరెస్టు చేసి బెదిరించి జగన్‌కు వ్యతిరేకంగా వాంగ్మూలాలు సేకరిస్తున్నారు’’ అని పేర్ని నాని ఆరోపించారు. ఈ మాటలను బట్టి జగన్ అరెస్టుపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆందోళనగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈవిషయాన్ని వైఎస్ జగన్ ఇప్పటికీ గుర్తించి ఉంటారని, ముందుజాగ్రత్త చర్యలను ఇప్పటికే మొదలుపెట్టి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.
Also Read :Jr NTRs Birthday : జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే.. కెరీర్‌లోని కీలక ఘట్టాలివీ
జగన్ కీలక వ్యాఖ్యలు
లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి, మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిలను ఇప్పటికే సిట్ అధికారులు(YS Jagan Vs Arrest) అరెస్ట్ చేశారు. ఈ అంశంపై ఇటీవలే వైఎస్సార్ సీపీ సమావేశం వేదికగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘లేని లిక్కర్ స్కాంను సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. వీళ్లు మహా అయితే రెండు, మూడు నెలలు జైలులో ఉంచగలుగుతారు’’ అని జగన్ చెప్పుకొచ్చారు. ఈ లెక్కన తన అరెస్టు కూడా జరగొచ్చనే అంశాన్ని వైఎస్ జగన్ పరోక్షంగా వెల్లడించారు.
ఆగస్టులోగా అరెస్టయ్యే అవకాశాలు ?
ఆగస్టు నెలలోగా జగన్ అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. అప్పటిలోగా వైఎస్సార్ సీపీ క్యాడర్‌ను క్షేత్రస్థాయిలో యాక్టివేట్ చేయడంపై జగన్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పార్టీ జిల్లాల అధ్యక్షులకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. వారే ఆలోచించుకుని తమ పరిధిలో ఎలాంటి కార్యక్రమాలు అయినా చేపట్టొచ్చు. తన అరెస్ట్ జరిగితే మొత్తం ఏపీలోని 26 జిల్లాలలో ఉన్న వైసీపీ క్యాడర్ యాక్టివేట్ అయ్యేలా జగన్ ప్లాన్ చేశారట. అయితే జగన్‌కు ఇది తొలి అరెస్ట్ కాదు. ఆయన గతంలో 16 నెలల పాటు జైలులో ఉన్నారు.