Site icon HashtagU Telugu

NSG CBN : చంద్ర‌బాబు హ‌త్యకు కుట్ర? `ఎన్ ఎస్ జీ` హ‌డావుడి ఎందుకు?

CBN Kuppam

Chandrababu Security

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు(CBN) మీద హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతుందా? ఆయ‌న భ‌ద్ర‌త‌కు ముప్పు ఏర్ప‌డిందా? ఎన్ ఎస్ జీ (NSG)ఆక‌స్మాత్తు ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్న చంద్ర‌బాబు(CBN)కు ప్రాణాపాయం ఎవ‌రి నుంచి ఉంది? ఆయ‌న్ను చంపాల‌ని ఎవ‌రు స్కెచ్ వేస్తున్నారు? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం నేష‌న‌ల్ సెక్యూరిటీ గ్రూప్(NSG) ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆక‌స్మాత్తుగా చంద్ర‌బాబునాయుడు(CBN) నివాసం ఉంటోన్న ఉండ‌వ‌ల్లిలోని ఇళ్లు, టీడీపీ కేంద్ర కార్యాల‌యాన్ని ఎన్ ఎస్ జీ(NSG) గ్రూప్ క‌మాండ‌ర్ కౌసియార్ సింగ్ ప‌రిశీలించారు. ప్ర‌చార ర‌థం, చంద్ర‌బాబు ఛాంబ‌ర్, రాత్రి బ‌స చేసే బ‌స్సు త‌దిత‌రాల‌ను త‌నిఖీ చేశారు. భ‌ద్ర‌త‌కు సంబంధించిన కొన్ని సూచ‌న‌లు, స‌ల‌హాల‌ను పార్టీ కార్యాల‌య మేనేజ‌ర్ శ్రీకాంత్‌, ప‌రుచూరి కృష్ణ‌ల‌కు ఎన్ ఎస్ జీ తెలియ‌చేయ‌డం గ‌మ‌నార్హం.

బ‌హిరంగ స‌భ‌ల్లో టీడీపీ ప్రచార రథాలపైకి ఎక్కి చంద్ర‌బాబు ప్ర‌సంగిస్తారు. దాన్ని కూడా ఎన్ఎస్‌జీ ప‌రిశీలించింది. ప్రచార రథంపై చంద్రబాబు ఎక్కడి నుంచి ప్రసంగిస్తారనే వివరాలను సేక‌రించింది. ప్రచార రథంపై 6 ఫీట్ గ్లాస్ ఏర్పాటు చేయాలని సూచించింది. చంద్రబాబు హైట్‌కి సరిపడా ఉండే గ్లాస్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మునుపెన్న‌డూ లేనివిధంగా ఈసారి ఎన్ ఎస్ జీ(NSG) స్పందించింది. అంటే, కేంద్ర నిఘా వ‌ర్గాలు చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌పై అనుమానాల‌ను వ్య‌క్తం చేసి ఉండొచ్చు. పైగా ఇటీవ‌ల కుప్పం, నంద్యాల ప్రాంతాల్లో జ‌రిగిన‌ ఆయ‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌లు నిఘా వ‌ర్గాల‌ను అప్ర‌మ‌త్తం చేసి ఉండే అవ‌కాశం ఉంది. జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను చంద్ర‌బాబు(CBN)కు కేంద్రం క‌ల్పిస్తోంది. దాని ప్ర‌కారం ప్రోటోకాల్ అమ‌లు చేయాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వం మీద ఉంటుంది. కానీ, ఆయ‌న కాన్వాయ్ కు పోలీస్ పైలెట్ ను ఇవ్వ‌కుండా కొన్ని రోజులు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చేసింది. ఏపీలోని లా అండ్ ఆర్డ‌ర్ పరిస్థితుల‌ను బేరీజు వేసిన కేంద్రం ఇటీవ‌ల చంద్ర‌బాబు  భ‌ద్ర‌త‌ను పెంచింది. క‌మాండోల సంఖ్య‌ను పెంచ‌డంతో పాటు ప్రోటోకాల్ ను స‌మీక్షించింది.

చంద్ర‌బాబు సెక్యూరిటీ ఆడిట్‌

ఏపీ, తెలంగాణ పోలీసులు వారం క్రితం చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌కు సంబంధించిన సెక్యూరిటీ ఆడిట్ చేశారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో నెల‌కొన్ని ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కారానికి ఆయ‌న ఇంటి వ‌ద్ద ఉన్న రెండు ర‌హ‌దారుల‌ను ఓపెన్ చేయాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యం తీసుకున్నారు. అదే స‌మ‌యంలో ఆయన భ‌ద్ర‌త‌ను ప‌ర్య‌వేక్షించ‌డానికి ఎన్ ఎస్ జీ రంగంలోకి దిగింది. ప్ర‌తి రోజూ చంద్ర‌బాబు యాక్టివిటీస్ ను ఆధారంగా చేసుకుని అణువ‌ణువు ఎన్ ఎస్ జీ (NSG)ప‌రిశీలించింది. గ‌తంలో 6-6 గా ఉన్న ఎన్‌ఎస్‌జీ భద్రత ప్రస్తుతం 12-12 ఎన్‌ఎస్‌జీ గా మార్చేయ‌డం జ‌రిగింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఎనిమిది మంది ఉండగా అదనంగా మరో 20 మందిని నియమించారు. అంతేకాదు, గ‌తంలో డీఎస్పీ ర్యాంకు అధికారి పర్యవేక్షణ ఉండ‌గా ఇప్పుడు డీఐజీ ర్యాంకు అధికారి పర్యవేక్షణ కొన‌సాగుతోంది. ఇటీవ‌ల స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే రెండుసార్లు కౌషియార్‌సింగ్‌ చంద్రబాబు భద్రతను సమీక్షించారు.

హ‌త్య‌కు జ‌గ‌న్ కుట్ర‌

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల ఆధారంగా చంద్ర‌బాబు  హ‌త్య‌కు కుట్ర జరుగుతుంద‌ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుమానం వ్య‌క్తం చేశారు. ఎవ‌రైనా హైద‌రాబాద్ లో ఉంటూ ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు చేస్తే గుండెపోటు వ‌స్తుంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల హెచ్చ‌రించారు. ఆ వ్యాఖ్య‌ల‌ను బేస్ చేసుకుని `గుండె పోటు` అంటే బాబాయ్ వివేకానంద‌రెడ్డి పై `గొడ్డ‌లి పోటు` అంటూ బొండా ఉమ గుర్తు చేస్తూ చంద్ర‌బాబు హ‌త్య‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుట్ర ప‌న్నార‌ని ఆరోపించారు. ప్ర‌స్తుతం మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నాన‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల వ్యాఖ్యానిస్తూ హైదరాబాద్ లో ఉంటూ తనను విమర్శించే వారికి గుండెపోటు వస్తుంద‌ని అన్నారు. ఆ వ్యాఖ్య‌ల ఆధారంగా టీడీపీ అనుమానించింది. దానికి త‌గిన విధంగా కుప్పం కేంద్రంగా అన్న క్యాంటిన్ ధ్వ‌సం సంద‌ర్భంగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ `ఎన్ ఎస్ జీ` (NSG) దృష్టికి వెళ్లింది. ఇటీవ‌ల నంద్యాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బాబు మీద కొంద‌రు దుండగులు రాళ్లు విసిరారు. ఈ సంఘ‌ట‌న‌లు, టీడీపీ అనుమానాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని బ‌హుశా చంద్ర‌బాబు భ‌ద్రత‌ను ఎప్ప‌టిక‌ప్పుడు `ఎన్ ఎస్ జీ` ప‌రిశీలించి ఉండొచ్చు. లేదంటే చంద్ర‌బాబు భ‌ద్ర‌త‌కు సంబంధించి కేంద్ర నిఘా వ‌ర్గాలు ప్ర‌త్యేక నివేదిక ఆధారంగా ఎన్ ఎస్ జీ అప్ర‌మ‌త్తమై ఉండొచ్చు. ఏదేమైనా చంద్ర‌బాబు(CBN) భ‌ద్ర‌త మీద అనుమానాలు రావ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

CBN Kurnool: క‌ర్నూలు టీడీపీ దూకుడు, చంద్ర‌బాబు జోష్‌!