NDA Meeting TDP: ఎన్డీయేలోకి టీడీపీ? జులై 18న ఢిల్లీలో ఎన్డీయే విస్తృత స్థాయి స‌మావేశం.. టీడీపీకి ఆహ్వానం!

జులై 18న ఢిల్లీలో ఎన్డీఏ విస్తృత స్థాయి సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశంలో టీడీపీ, శిరోమణి అకాలి దళ్, లోక్ జనశక్తి పార్టీలకు ఆహ్వానం అందింది. దీంతో ఎన్డీయేలో టీడీపీ చేరుతుంద‌న్న వాద‌న‌కు బ‌లంచేకూరుతోంది.

  • Written By:
  • Updated On - July 7, 2023 / 12:31 PM IST

ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఎన్డీయే (NDA) లోకి టీడీపీ (TDP) చేర‌డం ఖాయ‌మైందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఇటీవ‌ల ఢిల్లీ (Delhi) వెళ్లిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు (Chandrababu naidu) బీజేపీ జాతీయ అధ్య‌క్షులు జేపీ న‌డ్డా (JP Nadda), కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) తో భేటీ అయ్యారు. అప్ప‌ట్లో ఎన్డీయేలో టీడీపీ చేర‌బోతుంద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఇటీవ‌ల బీజేపీ ఏపీలో అధికారంలోఉన్న వైసీపీని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తుంద‌ని, ముగ్గురు ఎంపీల‌కు కేంద్ర మంత్రి వ‌ర్గంలో చోటు ల‌భిస్తుంద‌ని ఏపీ రాజ‌కీయాల్లో విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. అయితే, తాజాగా ఎన్టీయేలో చేర‌బోయేది టీడీపీనే అని తెలుస్తోంది. జులై 18న ఢిల్లీలో ఎన్డీయే విస్తృత స్థాయి సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ స‌మావేశంకు టీడీపీ, శిరోమణి అకాలి దళ్, లోక్ జనశక్తి పార్టీలకు ఆహ్వానం అందిన‌ట్లు తెలిసింది. ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తుంటే ఏపీ నుంచి ఎన్డీయేలో చేరేది టీడీపీనేఅని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే, పూర్తిస్థాయి స్ప‌ష్ట‌త 18న స‌మావేశం త‌రువాత వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

మ‌రో ఏడాదిలో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వ‌రుస‌గా మూడోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు బీజేపీ అగ్ర‌నాయ‌క‌త్వం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఈ క్ర‌మంలో ఎన్డీయేను విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించింది. ఈ ప్ర‌య‌త్నాల్లో భాగంగా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల‌ను బీజేపీ అగ్ర‌నేత‌లు సంప్ర‌దిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో జేపీ న‌డ్డా, అమిత్ షా స‌మావేశం అయ్యారు. ఈ క్ర‌మంలోనే గ‌త నెల‌లో చంద్ర‌బాబుతో వీరి భేటీ జ‌రిగింది.

ఏపీలో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ ప్ర‌భుత్వం బీజేపీతో స‌ఖ్య‌త‌తోనే ఉంటుంది. పార్ల‌మెంట్‌లో బిల్లులు పాస్ చేసే స‌మ‌యంలో ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా కేంద్రానికి వైసీపీ అండ‌గా ఉంటూవ‌స్తుంది. దీంతో ఎన్డీయేలో చేర‌బోయేది వైసీపీనే అని ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌ నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేనతో క‌లిసి బీజేపీ ముందుకెళ్లాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే పార్ల‌మెంట్‌లో ప్రాతినిధ్యం క‌లిగిన‌ టీడీపీని ఎన్డీయేలో చేర్చుకోవ‌టం ద్వారా ఏపీలో వ‌చ్చేఏడాది జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ రెండు ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి పొత్తుద్వారా బీజేపీ ఎన్నిక‌ల బ‌రిలో దిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఏపీ బీజేపీ అధ్య‌క్షులుగా ఉన్న సోము వీర్రాజును రెండు రోజుల క్రితం కేంద్ర పార్టీ అధిష్టానం త‌ప్పించింది. అత‌ని స్థానంలో నూత‌న అధ్య‌క్ష బాధ్య‌త‌లు ద‌గ్గుబాటి పురంధ‌రేశ్వ‌రికి అప్ప‌గించింది. పురంధ‌రేశ్వ‌రికి బీజేపీ రాష్ట్ర ప‌గ్గాలు అప్ప‌గించ‌డం వెనుక బీజేపీ వ్యూహం ఉన్న‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ ఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌తో క‌లిసి న‌డిచేందుకు నిర్ణ‌యించుకుంద‌ని, ఈ క్ర‌మంలో పురంధ‌రేశ్వ‌రి అయితే, మూడు పార్టీల మ‌ధ్య సంబంధాలు మెరుగ్గా ఉంటాయ‌ని భావించి ఆమెకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. గ‌త కొంత‌కాలంగా ఏపీ నుంచి ఎన్డీయేలో చేరేది టీడీపీనా? వైసీపీనా? అనే అంశం ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీనే ఎన్డీయేలో చేర‌బోయే పార్టీ అని స్ప‌ష్ట‌మ‌వుతుంది. అయితే, ఈ నెల 18వ తేదీ త‌రువాత అంశంపై పపూర్తిస్థాయి స్ప‌ష్టత వ‌స్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

MP Bandi Sanjay : గ‌తంలో విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ.. కిష‌న్ రెడ్డిపై బండి సంజ‌య్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు