Site icon HashtagU Telugu

Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!

CM Chandrababu

CM Chandrababu

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి (Amaravati) క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్‌లో QPIAI (Quantum Photonics Institute of Artificial Intelligence) కీలక భాగస్వామ్యం కానుంది. నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఏర్పాటు అవుతున్న ఈ క్వాంటం వ్యాలీలో QPIAI సంస్థ అధునాతన 8-క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు QPIAI వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్‌తో చర్చించారు.

ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. దీనితో పాటు అమరావతిలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని QPIAIని ముఖ్యమంత్రి కోరారు. తద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లు క్వాంటం అల్గారిథమ్‌లు, అప్లికేషన్‌లను రూపొందించుకునేందుకు విస్తృత అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

Also Read: Rishabh Pant: రిష‌బ్ పంత్ స్థానంలో జ‌ట్టులోకి రానున్న ఇషాన్ కిష‌న్‌..?!

క్వాంటం కంప్యూటింగ్ సేవలను కేవలం పరిశోధనలకే పరిమితం చేయకుండా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.

వ్యవసాయ రంగం: రాష్ట్రంలో వివిధ పంటల సాగులో కచ్చితత్వం, తెగుళ్లను అంచనా వేయడం, వ్యవసాయ ఉత్పత్తిని పెంచేందుకు సకాలంలో సూచనలు, సలహాలు అందించడం ద్వారా రైతుల ఆదాయాలను మెరుగుపరచడానికి క్వాంటం కంప్యూటింగ్ ఉపకరించాలని సీఎం పేర్కొన్నారు.

నీటి వనరుల నిర్వహణ: రాష్ట్రంలో నీటి వనరులను సమర్థంగా నిర్వహించేందుకు క్వాంటం టెక్నాలజీని ఉపయోగించాలని సూచించారు.

వైద్య రంగం: వ్యాధుల నిర్ధారణ, మెడికల్ లాజిస్టిక్స్ వంటి అంశాల్లోనూ క్వాంటం సిమ్యులేషన్‌ను సమర్థంగా వినియోగించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

నైపుణ్య అభివృద్ధి: యువతకు నైపుణ్యాలను కల్పించే అంశంలో కూడా క్వాంటం టెక్నాలజీ సహకారాన్ని తీసుకునేలా ప్రభుత్వం యోచన చేస్తోంది.

క్వాంటం వంటి ఆధునిక సాంకేతికత ద్వారా సామాన్య ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం కార్యాచరణ చేస్తోంది. విద్య, పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో డీప్ టెక్నాలజీ ద్వారా సమాజానికి విస్తృత ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా QPIAI, నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ పనిచేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ భాగస్వామ్యం రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి నాంది పలకనుంది.