Nuclear Submarine Base: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కీలకమైన రక్షణ రంగ ప్రాజెక్టు మొదలైంది. భారత నౌకాదళం తూర్పు కమాండ్ ప్రధాన స్థావరం విశాఖపట్నంలో ఉంది. దీనికి 50 కిలోమీటర్ల దూరంలో అనకాపల్లి జిల్లా రాంబిల్లి గ్రామంలోని సముద్ర తీరం ఇందుకు వేదికగా మారింది. అక్కడ కొత్త నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్ టన్నెల్స్‌ను నిర్మిస్తున్నారు. ఇవి చాలా బలంగా, లోతుగా ఉంటాయి. వీటిలో భారత ఆర్మీకి చెందిన న్యూక్లియర్ సబ్‌మెరైన్లు, యుద్ధ నౌకలను భద్రపరుస్తారు.
చైనా శాటిలైట్లకు చిక్కకుండా ఉండేందుకే..
హిందూ మహా సముద్ర జలాల్లో చైనా దూకుడును పెంచింది. భవిష్యత్తులో ఆ దేశంతో ఉద్రిక్తతలు తలెత్తితే, ధీటుగా సమాధానం ఇచ్చేందుకు అవసరమైన యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లను రాంబిల్లి గ్రామంలోని నేవీ బేస్‌లో సిద్ధంగా ఉంచుతారు. చైనా(Nuclear Submarine Base) శాటిలైట్లకు కనిపించకుండా అకస్మాత్తుగా యుద్ధ నౌకలు, అణ్వస్త్ర జలాంతర్గాములను హిందూ మహాసముద్రంలోకి పంపేందుకు ఈ టన్నెల్స్ ఉపయోగపడతాయని భారత్ భావిస్తోంది. తద్వారా హిందూ మహాసముద్రంలోని కీలకమైన మలక్కా జలసంధి దిశగా మోహరింపును పెంచొచ్చని భారత సైనిక వర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేవీ బేస్‌కు ‘ఐఎన్‌ఎస్ వర్ష’ అని పేరు పెట్టారు. ఈ నౌకాదళ స్థావరం పనులు 2022లోనే ప్రారంభం కాగా, దాన్ని వచ్చే సంవత్సరం (2026లో) ప్రారంభించాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. కరోనా సంక్షోభ కాలం వల్ల దీని పనుల్లో కొంత జాప్యం జరిగింది. దేశ రక్షణకు ఉపయోగపడే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 670 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించింది.
Also Read :Falaknuma Express: రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్.. తప్పిన ప్రమాదం
కర్వార్ నేవీ బేస్‌లో సైతం..
కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ సముద్ర తీరాన్ని కూడా భారత సైన్యం బలోపేతం చేస్తోంది. దాన్ని శత్రు దుర్బేధ్యంగా మారుస్తోంది. ఆ రాష్ట్రంలోని కర్వార్ నేవీ బేస్‌లో రక్షణ ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ప్రాజెక్ట్ సీ బర్డ్ ద్వారా ఈ బేస్‌లో 32 యుద్ధ నౌకలను సిద్ధంగా ఉంచుతారు. కర్వార్ బేస్ 25 కి.మీ పరిధిలో విస్తరించి ఉంది. ఫేజ్-2బీలో భాగంగా 50 యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు, 40 ఆక్సిలియరీ క్రాఫ్ట్‌లను నిలిపి ఉంచేలా మౌలిక వసతులను కల్పించనున్నారు. ఓ వైపు రాంబిల్లి గ్రామంలోని నేవీ బేస్, మరో వైపు కర్వార్ నేవీ బేస్‌లను వాడుకొని భవిష్యత్తులో చైనాను సైనికపరంగా ధీటుగా ఎదుర్కోవచ్చని భారత్ భావిస్తోంది.