AP SSC Exams ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఇంగ్లీషు పరీక్ష తేదీని మారుస్తూ పాఠశాల విద్యాశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని అధికారులు సూచించారు.
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 20న జరగాల్సిన ఇంగ్లీషు పరీక్షను మార్చి 21వ తేదీన నిర్వహించనున్నారు. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ మార్పు చేసినట్టు విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ ఒక్క పరీక్ష తేదీ మినహా మిగిలిన అన్ని పరీక్షల షెడ్యూల్ యథాతథంగా కొనసాగుతుందని తెలిపింది.
కాగా, పదో తరగతి పరీక్షలు ముందుగా నిర్ణయించినట్లుగానే మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సవరించిన పూర్తి టైమ్ టేబుల్ కోసం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inను సందర్శించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
