రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా (Illegal mining mafia in East Godavari District) కార్యకలాపాలు తీవ్రమయ్యాయని, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కల్వచర్ల గ్రామంలో పోలవరం ఎడమ కాలువ, పుష్కర కాలువ పనులు జరుగుతున్న నేపథ్యంలో, స్థానిక జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనుచరులు రోజుకు వందల లారీలతో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అరాచకాలు భరించలేక స్థానిక ప్రజలు అర్థరాత్రి లారీలను అడ్డుకుని, మట్టి మాఫియాపై తిరుగుబాటు చేశారు. ఈ ఘటన రాత్రికి రాత్రే వైరల్ కావడంతో ప్రజలలో తీవ్ర చర్చకు దారితీసింది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఇటువంటి దందాలు శృతిమించుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో కాలువలను ఆక్రమించినా, నీళ్లు వెళ్లే మార్గాన్ని అడ్డుకున్నా సహించేది లేదని హెచ్చరించినప్పటికీ, సాక్షాత్తూ ఆయన పార్టీకి చెందిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సారథ్యంలో ప్రతిష్టాత్మకమైన పోలవరం కాలువ, పుష్కర కాలువ మట్టిని అడ్డగోలుగా తరలిస్తున్నారని, ఆయన చేష్టలుడిగి చూస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ హెచ్చరికలకు విరుద్ధమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కల్వచర్ల గ్రామస్తులు రోజుకు 100 లారీల కంటే ఎక్కువ నాన్-స్టాప్‌గా తిరుగుతున్నాయని, అడిగేవాడు, ఆపేవాడు లేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని, అందరూ తేలు కుట్టిన దొంగల్లా గమ్మున ఉంటున్నారని వారు సీరియస్ అవుతున్నారు. అధికారుల చుట్టూ తిరగడానికే తమ సమయం సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒకరిని అత్యవసరంగా 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా, ఈ మట్టి లారీల వల్ల రెండు గంటలు ఆలస్యం కావడంతో ఒక నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మట్టి మాఫియా ఆగడాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర నష్టాలకు నిదర్శనం.
మట్టి మాఫియా పుష్కర కాలువ కోసం తవ్విన మట్టిని కాకుండా, మొత్తం కాలువ పునాదులనే తవ్వి లాగేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇలా జరిగితే కాలువ గట్లు బలహీనంగా మారతాయని, రేపు కాలువలకు నీళ్లు వదిలినప్పుడు గండ్లు పడి ఊళ్లకు ఊళ్లే మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలందరూ ఏకమై తిరుగుబాటు చేశామని అన్నారు. మొత్తానికి మట్టి మాఫియా చేస్తున్న ఆగడాలపై వార్తలు రావడంతో ప్రస్తుతం పరిస్థితులు నిశ్శబ్దంగా మారాయని తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో రేపు కూటమి నేతలు ఎలా స్పందిస్తారో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంచి ప్రభుత్వమని ఓట్లేసి గెలిపిస్తే, తమకు అన్యాయం చేస్తున్నారని నెట్టింట్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.