ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) పేద మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఉచిత కుట్టు మిషన్ పథకాన్ని (Free Sewing Machines) ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయడంతో పాటు, టైలరింగ్ శిక్షణ కూడా ఉచితంగా అందిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1 లక్ష కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతానికి 60 నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతి నియోజకవర్గానికి 3,000 చొప్పున పంపిణీ చేయనున్నారు.
అర్హతలు మరియు దరఖాస్తు విధానం :
ఈ పథకానికి కేవలం మహిళలకే అర్హత ఉంది. దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసులు కావాలి. వారికీ సరిగ్గా ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. వయసు 20 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు మరియు పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదు. వితంతువులు, దివ్యాంగ మహిళలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. టైలరింగ్ శిక్షణ సమయంలో కనీసం 70% హాజరు ఉంటేనే ఉచిత కుట్టు మిషన్ అందజేస్తారు. ప్రస్తుతం BC, EWS కులాలకు చెందిన మహిళలు అర్హులు, త్వరలోనే ఎస్సీ మహిళలకు కూడా పథకం వర్తించనున్నట్లు సమాచారం.
దరఖాస్తు ప్రక్రియ మరియు తదుపరి కార్యాచరణ :
ఈ పథకానికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి వెబ్‌సైట్ లేదా ఆన్‌లైన్ ఆప్షన్ లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి. దరఖాస్తు చేసేందుకు ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, మొబైల్ నెంబర్, పాస్ పోర్ట్ సైజు ఫోటో, దరఖాస్తు ఫారం అవసరం. ప్రస్తుతం 1,02,000 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. శిక్షణ కేంద్రాలను త్వరలోనే ప్రారంభించనున్న ప్రభుత్వం హాజరు నమోదుకు ప్రత్యేక యాప్‌ను కూడా అభివృద్ధి చేసింది. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడంతో పాటు, ఆర్థికంగా వారికీ సహాయపడనుంది.