Idi Manchi Prabhutvam Programme : రేపు (సెప్టెంబర్ 20) కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అవుతుంది. ఈ సందర్బంగా ప్రభుత్వం సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లబోతుంది. రేపటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ (Idhi Manchi Prabhutvam) పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 20 నుంచి 6 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు వివరించేలా MLAలు వారి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు (Chandrababu) రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని కవిటి మండలం రాజాపురం (Chandrababu Rajapuram) గ్రామంలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి చంద్రబాబు వస్తుండడంతో శ్రీకాకుళం జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. సిక్కోలు ప్రాంతమే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి పార్టీ నాయకులు తరలిరానున్నారు. ఇది మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వాలు ఇవి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని ఆయన తెలిపారు. 100 రోజుల్లో వందకు పైగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన ”ఇది మంచి ప్రభుత్వం”. గత ప్రభుత్వం అమలు చేసిన నిర్బంధ, అణచివేత విధానాలకు స్వస్తి చెప్పి ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛను తిరిగి తెచ్చిన ప్రభుత్వం ఇది. అందుకే ఇది మంచి ప్రభుత్వం అని.. దీనికి సంబంధించిన లోగోని షేర్ చేస్తూ సీఎం చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Read Also : Young India Skill University : స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు రూ.100 కోట్లు కేటాయించిన సీఎం రేవంత్