Site icon HashtagU Telugu

Pawan Kalyan: ప్రజారాజ్యంలా జనసేన ఏ పార్టీలోనూ విలీనం కాదు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ వెనుక నడవడం లేదని, తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన అధికారం కోసం ఓట్లు అడగడం లేదని.. మార్పు కోసం తనను ఆశీర్వదించాలని కోరుతున్నట్టు పవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చానని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ 2019లో రాలేకపోయిన జనసేనాని.. ఏపీ భవిష్యత్తు కోసం 2024లో మళ్లీ కలిసి వస్తున్నామన్నారు. ఎన్నో ఓటములు చవిచూసిన పవన్ కళ్యాణ్.. తాను జీవించి ఉన్నంత వరకు జనసేన పార్టీని మరో పార్టీలో విలీనం చేయనని స్పష్టం చేశారు. ప్రజారాజ్యంలా జనసేన మారబోదని.. మీ ప్రేమను ఓట్లుగా మార్చుకోవాలని జనసేన కార్యకర్తలను కోరారు.

విశాఖ ఉక్కు అంశంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… విశాఖ ఉక్కు అంశం భావోద్వేగాలతో కూడుకున్నదని, ఇదే విషయాన్ని కేంద్ర నేతలకు తెలియజేసినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం అన్ని జిల్లాలను ఏకం చేసిందని పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ ఉక్కుపై అమిత్ షా అభిప్రాయాన్ని గౌరవించారన్నారు. తాను ఎన్నడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని, ఒక తరం కోసం ఆలోచించానని అన్నారు. ఈ తరాన్ని కాపాడుకుంటూనే భావి తరం కోసం కృషి చేస్తానన్నారు. తాను ఓట్ల కోసం రాలేదని, మార్పు కోసం ఓట్లు వేయాలని పవన్ కల్యాణ్ కోరారు.

ఏపీలో ఆడపిల్లలకు భద్రత కల్పించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఆడపిల్లల అదృశ్యంపై మాట్లాడితే హేళన చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను వైసీపీ ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకోవడం లేదని.. టీడీపీ, జనసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పోలీసు శాఖ పూర్వవైభవం తెస్తామన్నారు. వైసీపీ 151 సీట్లతో గెలిచినా సరైన ఉద్యోగాలు ఇవ్వలేదని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతే తన ఆలోచన, ఆశయం అని చెప్పిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో జగన్ ను ఓడించి టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Senaga Vadalu: చలికాలంలో వేడివేడి శెనగల వడలు.. ఇంట్లోనే చేసుకోండిలా?