Site icon HashtagU Telugu

R Krishnaiah : నేను అడగలేదు.. బీజేపీయే పిలిచి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చింది : ఆర్ కృష్ణయ్య

R Krishnaiah Bjp Rajya Sabha Candidate Telangana

R Krishnaiah : బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ వేసిన అనంతరం బీసీ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలే తన దగ్గరకు వస్తున్నాయని.. తాను ఎన్నడూ పార్టీలను వెతుక్కుంటూ పోలేదని  ఆయన స్పష్టం  చేశారు. పార్టీలు మారే అలవాటు కానీ, ఆలోచన కానీ తనకు లేదని తేల్చి చెప్పారు.  ‘‘ఇప్పుడు బీజేపీ పిలిచి మరీ నాకు రాజ్యసభ ఎంపీ పదవి ఇచ్చింది. 50 ఏళ్లుగా బీసీల కోసం పోరాడుతున్నాను.  నేను ఎక్కడున్నా బీసీల కోసమే మాట్లాడుతాను. వాళ్ల కోసమే పోరాటం చేస్తాను’’ అని  ఆర్‌.కృష్ణయ్య వెల్లడించారు.

Also Read :No Confidence Motion : ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌పై ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం.. ఎందుకు ?

ఇక రాజ్యసభలోకి వెళ్లి.. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశం గురించి గళమెత్తుతానని ఆయన చెప్పారు. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనను రాజకీయాల్లోకి ఆహ్వానించారని గుర్తు చేసుకున్నారు.  తన ఎన్నికకు సహకరిస్తున్నందుకు బీజేపీ హైకమాండ్‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఆర్‌.కృష్ణయ్య(R Krishnaiah) ధన్యవాదాలు తెలిపారు. ‘‘వైఎస్సార్ సీపీలో మాట్లాడే అవకాశం తక్కువ. వాళ్లు నాకు పార్లమెంటులో మాట్లాడేందుకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. బీసీల గురించి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుందనే ఆలోచనతో బీజేపీలో చేరుతున్నాను. బీజేపీ నాకు కొత్తది కాదు. అయితే నేను కండువా కప్పుకున్న మొదటి పార్టీ బీజేపీ మాత్రమే. నేను కండువాల కోసం పార్టీలో చేరలేదు. బీసీలకు న్యాయాన్ని సాధించేందుకు బీజేపీలో చేరాను’’ అని ఆయన వెల్లడించారు. తెలంగాణకు చెందిన ఆర్‌.కృష్ణయ్య గతంలో వైఎస్సార్ సీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా వ్యవహరించారు. అయితే ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆయనకు బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా అవకాశం లభించింది.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్డీయే కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి బీద మస్తాన్‌ రావు, సానా సతీశ్‌,  బీజేపీ నుంచి ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేశారు. ముగ్గురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీకి తగిన సంఖ్యాబలం లేదు. దీంతో ఆ పార్టీ ఈ ఎన్నికకు దూరంగా ఉండిపోయింది. దీంతో ఎన్డీయే కూటమి అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది.