Pawan Kalyan: తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు పుస్తకాల పట్ల ఉన్న ప్రేమను పవన్ వివరించారు. పుస్తకాలు చదవటం అంటే తనకు ఇష్టమని ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ పుస్తక ప్రియులు కావాలని పవన్ ఆకాక్షించారు. అయితే తనకు పాకెట్ మనీ కావాలంటే తన వదిన సురేఖను అడిగేవాడ్ని అని తెలిపారు. ఆమె ఇచ్చిన డబ్బుతో దగ్గరలో ఉన్న బుక్ స్టాల్‌కు వెళ్లి తనకు ఇష్టమైన పుస్తకాన్ని కొనుక్కునేవాడ్ని అని పవన్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నారు.
తొలిప్రేమ సినిమా రెమ్యూనరేషన్‌లో కొంత మొత్తంతో పుస్తకాలు కొన్నట్లు ఆయన తెలిపారు. ఆ సినిమాకి రూ 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ఆ పారితోషికంలో సుమారు రూ. 2 లక్షలు పెట్టి బుక్స్ కొన్నట్లు చెప్పారు. తనకు బుక్స్ షాప్‌కి వెళ్తే బ్యాంక్ వాల్ట్‌కు వెళ్లి లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో బుక్స్ చూస్తే తనకు అలా ఉంటుందని అన్నారు. ఆయన కోరుకున్న పుస్తకాలు కావటంతోనే అంత డబ్బు ఖర్చుపెట్టినట్లు చెప్పారు. అయితే బుక్స్ కొన్న తర్వాత మూడు రోజులు నిద్రపోలేదని తెలిపారు. అన్ని బుక్స్ చూసే సరికి తనకు నిద్ర రాలేదని ఏదో బుక్ తీయటం కాస్త చదవటం, మళ్లీ వేరే బుక్ చదవటం లాంటివి చేసినట్లు చెప్పారు. పుస్తకాల విషయంలో కక్కుర్తి ఎక్కువగా ఉందని చెప్పారు. తనకు పిల్లలకు కూడా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలని చెప్పినట్లు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.
Also Read: Game Changer Event: మెగా అభిమానులకు డబుల్ బొనాంజా.. ఒకే వేదికపై పవన్, రామ్ చరణ్
సోషల్ మీడియా కాదు.. పుస్తకం పట్టండి
నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నారన్నారు. దానికంటే మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చదవాలని సూచించారు. దీనివల్ల మానసికంగా బలంగా అవుతామని, సమస్యలను, కష్టాలను, మనుషులను అర్ధం చేసుకునే తత్వం బోధపడుతుందన్నారు. సోషల్ మీడియాలో గంటలకు గంటలు గడిపేకంటే పోరాటం చేసే శక్తిని నింపే పుస్తకాలను పట్టుకోండని పిలుపునిచ్చారు.