Balineni Srinivasa Reddy: తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి (Balineni Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా జగన్ నిర్ణయాలను తాను వ్యతిరేకిస్తున్నాని చెప్పారు. అయితే ఆయన రేపు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ అయి జనసేన కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బాలినేనితో పాటు మరికొందరు నాయకులు కూడా రేపు జనసేనలో చేరనున్నట్లు సమాచారం. అయితే పార్టీ రాజీనామాపై బాలినేని శ్రీనివాస రెడ్డి తాజాగా స్పందించారు.
పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బాలినేని మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను గత కొద్ది రోజుల నుంచి నేను వ్యతిరేకిస్తున్నాను. ఆ నిర్ణయాలకు కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటున్నాను. ఈరోజు పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. రాజీనామా చేశాను. వైసీపీలో ఒక కుట్ర నడుస్తుంది. ఇప్పుడు కూడా ఆ కుట్ర నడుస్తూనే ఉంది. వైసీపీలో అవమానం జరగడంతోనే పార్టీకి ఈరోజు రాజీనామా చేశాను. నేను పార్టీ నుంచి వెళ్లిపోవాలని వైసీపీ నేతలే కోరుకున్నారు. నా పైన తప్పుడు ఆరోపణలు చేశారు. నేను అనని మాటలు అన్నట్టు క్రియేట్ చేశారు. నేను జగన్ ముందు ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు. ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు జరుగుతున్నాయని కొన్ని విషయాలు చెప్పాను. వాటిని జగన్ నెగిటివ్‌గా తీసుకున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో నా నిర్ణయం చెప్పాను. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. పార్టీలో నాకు జరిగినటువంటి అన్ని విషయాలు రేపు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
Also Read: Bloomberg Billionaire List: ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చిన ఒకప్పటి డెలివరీ బాయ్..!
నెల్లూరు జిల్లా నాయకులతో జగన్ భేటీ
మరోవైపు బాలినేని రాజీనామాతో ఖంగుతిన్న జగన్ వెంటనే నెల్లూరు జిల్లాలోని వైసీపీ నాయకులతో భేటీ అయ్యారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై వారితో చర్చించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ వారికి సూచించారు. పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని, ప్రజల్లో పార్టీ ఆదరణ ఇంకా పెరుగుతుందని వారికి ధైర్యం చెప్పారు. ఈ భేటీలో ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ మంత్రులు కాకాని, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.