హోల్‌సేల్ మార్కెట్‌లో నిమ్మ కాయల ధరలు భారీగా పడిపోయాయి. కిలో రూ.20కి ధరలు పడిపోయాయి. ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో నెల్లూరు, తిరుపతి జిల్లాల నిమ్మ రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. ప్రధాన నగరాలకు నిమ్మకాయలను ఎగుమతి చేసేందుకు పేరుగాంచిన గూడూరు, పొదలకూరులోని నిమ్మ మార్కెట్లలో గత మూడు నెలలుగా వ్యాపారం మందగించింది. నిమ్మకాయల ధరల్లో విపరీతమైన తగ్గుదల ఉందని వ్యాపార వర్గాలు తెలిపాయి. గత ఏడాది ఫస్ట్‌గ్రేడ్ నిమ్మకాయలు కిలో రూ.160 నుంచి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి నుంచి ప్రస్తుతం కిలో రూ.20కి పడిపోయాయి. దీంతో గూడూరు, పొదలకూరు మార్కెట్లకు వచ్చే రైతులు నాణ్యమైన నిమ్మకాయలను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. తాము ఇంతటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని.. రెండు నెలల క్రితం నిమ్మకాయ మార్కెట్‌లో మంచి ధరలు లభించాయని రైతులు తెలిపారు. అయితే ఇప్పుడు పండ్లను పారవేసే పరిస్థితి వచ్చిందని..లేదంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గతేడాది ఈ మార్కెట్ల నుంచి ఇతర రాష్ట్రాలకు రోజుకు కనీసం 25 ట్రక్కులు రాగా, ఈ ఏడాది నిమ్మకాయల ధరలు భారీగా పతనమవడంతో 10 ట్రక్కులు కూడా రాలేదని నిమ్మ వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలోని రెండు ప్రధాన మార్కెట్‌ల నుంచి పీక్ సీజన్‌లో దేశంలోని వివిధ ప్రాంతాలకు రోజుకు 280-700 టన్నుల నిమ్మకాయలు పంపుతుంటారని వ్యాపారులు తెలపారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ మండలాల నుంచి నిమ్మకాయలను తెస్తున్నారని.. గూడూరు డివిజన్ నుండి ఎక్కువ నిమ్మకాయలు వస్తుంటాయని తెలిపారు. కానీ నిమ్మ మార్కెట్‌లో ప్రస్తుతం ధరలు విపరీతంగా తగ్గాయని తెలిపారు. దలకూరు, గూడూరు, కలువాయి, సైదాపురం, వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె, రాపూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 మండలాల్లోని డ్రైల్యాండ్‌లో సుమారు 75 వేల మంది రైతులు నిమ్మ సాగును చేపట్టినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇవి నీటిపారుదల కోసం బోర్‌వెల్‌లపై ఆధారపడుతున్నాయి. గతేడాది దసరా సందర్భంగా రూ.16 వేలకు విక్రయించిన 75 కిలోల బస్తా ఇప్పుడు రూ.1500-1600 పలుకుతోంది. నిమ్మకాయల వ్యాపారం రూ.60-70 కోట్ల సైజు నుంచి రూ.20 కోట్లకు పడిపోయిందని సమాచారం.
Also Read: AP : కన్నీరు పెడుతున్న మిర్చి రైతులు.. గుంటూరులో వందల ఎకరాల్లో ఎండిపోయిన పంట