రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా జనజీవనం అతలాకుతలమవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ – విజయవాడ జాతీయరహదారి(NH-65) పైకి వరద నీరు చేరింది.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామసమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అలాగే కంచికచర్ల మండలం కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు కలుస్తాయి. దీంతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కీసర వంతెన వద్ద మూడు ఏర్లు కలిసి వరద ఉదృతంగా ప్రవహిస్తోంది.
ఈ వరద నీరు రోడ్ మీదకు వచ్చేయడంతో హైవే అయినా మోకాళ్ళ లోతు నీళ్లు చేరాయి. ఈ వరదతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. వందలాది వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు బారులుతీరాయి. కొందరు వాహనదారులు వరదనీటిలోనే తమ వాహనాలను ముందుకు నడిపిస్తున్నారు. ఐతవరం వద్ద పోలీసులు ట్రాఫిక్ ని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. వరద నీరు తగ్గకపోతే రాత్రంతా పలువురు ప్రజలు ఆ హైవేపై జాగారం చేయాల్సిందే. హైదరాబాద్ – విజయవాడని కలిపే మెయిన్ దారి ఇదే అవ్వడంతో ట్రాఫిక్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Also Read : Warangal: వర్షాల కారణంగా కాజీపేట రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు?